మరీ టైరు బండ్ల మీద డ్యాన్సులు వేసే వాళ్ల తరహా.. అంటే తప్పేం లేదు! పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లేనా వీళ్లు? అనే ఎవరైనా కోపంగా ప్రశ్నిస్తే అందులోనూ ఆశ్చర్యం లేదు. సోషల్ మీడియాలు ప్రభుత్వ ఉద్యోగులను ట్రోల్ చేసే వాళ్లకు సదరు ఉద్యోగులే ఆయుధాలను అందించారు. అందులో ముఖ్యమైనది మహిళా టీచర్లు పాడిన ఊ అంటావా సీఎం, ఊఊ అంటావా సీఎం అనే మధురగీతం!
కాస్తైనా ఇంగితం ఉందా? మీరేంటి మీ బాధ్యతలు ఏంటి? మిమ్మల్ని సమాజం చూసే ధోరణి ఏమిటి? పిల్లలకు చదువు చెబుతారనే విషయంలో మిమ్మల్ని సమాజం ఎంత గౌరవిస్తుంది? మీరు ఏదైనా మంచి చెబుతారు, సంస్కారం నేర్పుతారు, సభ్యతతో ప్రవర్తిస్తారని సమాజం బ్లైండ్ గా నమ్మేస్తోందే! కానీ.. మీరు బజారు ఎక్కి పాడే పాటలు, నిరసన తెలిపే విధానం ఇదా?
ఐటమ్ సాంగ్ ను మీ నిరసనకు టైటిల్ సాంగ్ లెవల్లో ఉపయోగిస్తూ పాడతారా! అంటూ నివ్వెరపోతోంది సభ్య సమాజం. ప్రభుత్వ ఉద్యోగుల్లో వేరే రంగాల్లో పని చేసే వారు ఎవరైనా ఇలాంటి వల్గరిటీని చూపి ఉన్నా ప్రజలు పెద్దగా పట్టించుకునే వారు కాదేమో!
అయితే టీచరమ్మలు ఈ గేయాన్ని ఆలపించారు! రోడ్డెక్కి నిరసన పేరుతో .. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇలాంటి పాటలు పాడటానికి తెగించే వారు.. పిల్లలకు ఏం బుద్ధులు నేర్పుతారు మీరు? మీ దగ్గరకు పిల్లలను చదువుకు పంపించే తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారిక!
జబర్దస్త్ బ్యాచ్ లా రచ్చ చేస్తున్నారే, అది కూడా నిరసన పేరుతో! మీరు పొందుతున్న జీతాలే సామాన్యుడికి చుక్కల స్థాయిలో కనిపిస్తున్నాయి. అవి చాలవంటూ నిరసన తెలుపడాన్ని సామాన్యులు క్షమించడం లేదు. ఆపై మళ్లీ టైరు బండ్ల మీద డ్యాన్సులేసే వాళ్లలా వ్యవహరిస్తున్న మీ సంస్కారం యావత్ ఉపాధ్యాయ వృత్తికే కళంకాన్ని అంటిస్తోంది.
ఇక నుంచి టీచర్లా.. వాళ్ల కథ తెలుసులే అంటూ నిరక్షరాస్యులు కూడా ఉపాధ్యాయులను సంస్కార హీనులుగా చూసినా పెద్దగా ఆశ్చర్యం లేదు. సోషల్ మీడియా యుగం ఇది. ఇప్పటికే టీచర్ల సంస్కారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంకా వీరు ఏ స్థాయి వరకూ తమ గౌరవాన్ని తీసుకెళ్తారో చూడాలి.