కేఎల్ రాహుల్ లో కెప్టెన్సీ మెటీరియ‌ల్ లేన‌ట్టే!

కేఎల్ రాహుల్.. స్టార్ డ‌మ్ క‌న్నా ముందే కెప్టెన్సీ ద‌క్కిన క్రికెట‌ర్. సాధార‌ణంగా క్రికెట్ లో స్టార్ డ‌మ్ ను సంపాదించుకున్నాకే, అద్భుత రీతిలో స‌త్తా చాటుకున్న త‌ర్వాతే కెప్టెన్సీ ప‌గ్గాలు చేతికి అందుతూ…

కేఎల్ రాహుల్.. స్టార్ డ‌మ్ క‌న్నా ముందే కెప్టెన్సీ ద‌క్కిన క్రికెట‌ర్. సాధార‌ణంగా క్రికెట్ లో స్టార్ డ‌మ్ ను సంపాదించుకున్నాకే, అద్భుత రీతిలో స‌త్తా చాటుకున్న త‌ర్వాతే కెప్టెన్సీ ప‌గ్గాలు చేతికి అందుతూ ఉంటాయి. ప్ర‌త్యేకించి ఇండియ‌న్ క్రికెట్ లో. కానీ రాహుల్ మాత్రం కొహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల స్థాయి స్టార్ డ‌మ్ ను అందుకోక మునుపే కెప్టెన్సీని తాత్కాలికంగా అయినా చేప‌ట్టాడు.

కేవ‌లం జాతీయ జ‌ట్టుకే కాదు, ఇప్ప‌టికే ఐపీఎల్ ఒక జ‌ట్టుకు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించిన నేప‌థ్యం కూడా ఈ క్రికెట‌ర్ కు ఉంది. అంతే కాదు.. విరాట్ కొహ్లీ త‌న స్థానంలో రాహుల్ కే ప‌గ్గాలు అప్ప‌గించాల్సిందిగా కూడా సెల‌క్ష‌న్ క‌మిటీ బేటీలో డిమాండ్ చేశాడ‌నే వార్త‌లూ వ‌చ్చాయి. అయితే కెప్టెన్ గా రాహుల్ స‌త్తా ఏమిటో సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న కొంత క్లారిటీ ఇచ్చింది.

రాహుల్ కెప్టెన్సీలో రెండో టెస్టులో బ‌రిలోకి దిగింది టీమిండియా. ర‌హ‌నే పూర్ ఫామ్ తో ఉండ‌టంతో రెండో టెస్టులో అవ‌కాశం రాహుల్ కు ద‌క్కింది. వాస్త‌వానికి ఫ‌స్ట్ టెస్ట్ వ‌ర‌కూ టీమిండియాలో మంచి ఆత్మ‌విశ్వాసం క‌నిపించింది. కానీ, సెకెండ్ టెస్ట్ అనూహ్య ఓట‌మి మొత్తం క‌థ‌ను మార్చేసింది. స్టార్ క్రికెట‌ర్ల రిటైర్మెంట్ ల‌తో బ‌ల‌హీనంగా క‌నిపిస్తున్న సౌతాఫ్రికాపై రెండో టెస్టులో మిగిలిన ఓట‌మి, ఆ త‌ర్వాత మూడో మ్యాచ్ పై కూడా ప్ర‌భావాన్ని చూపించింది. రెండో టెస్టులో ఎలా ఓడారో, దానికి జిరాక్స్ లా మూడో టెస్టులో ఓడింది టీమిండియా.

ఇక వ‌న్డే సీరిస్ స‌మ‌యానికి రాహుల్ కు సీరిస్ ఆసాంతం కెప్టెన్సీ వ‌హించే అవ‌కాశం వ‌చ్చింది. అయితే మ‌రీ క్లీన్ స్వీప్ తో రాహుల్ కెప్టెన్సీ కి రెడ్ కార్డు పడుతోంది. ద‌క్షిణాఫ్రికా జ‌ట్టులో స్టార్ క్రికెట‌ర్ల ఉన్నప్పుడు కూడా, క్రితం సారి అక్క‌డ‌కు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లినప్పుడు టీమిండియా వ‌న్డే సీరిస్ ను గెలిచింది. ఆల్మోస్ట్ వ‌న్డేల్లో సౌతాఫ్రికాను చిత‌క్కొట్టింది టీమిండియా. కానీ ఈ సారి స్టార్లు లేని జ‌ట్టు చేతిలో వైట్ వాష్ అయ్యింది! 

ఇప్పుడు రాహుల్ కెప్టెన్సీపై కూడా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి రెండో టెస్టు స‌మ‌యంలోనే కెప్టెన్సీ ప‌గ్గాలు రాహుల్ కు అప్ప‌గించ‌డంపై కొంద‌రు మాజీలు విమ‌ర్శ‌లు చేశారు. మ‌రో అవ‌కాశం ర‌హ‌నేకే ఇవ్వాల్సింద‌న్నారు. ర‌హ‌నే పెద్ద ఫామ్ లో లేక‌పోయినా.. కెప్టెన్ గా ఆస్ట్రేలియాపై టెస్టు సీరిస్ గెలిచిన రికార్డు ర‌హ‌నేకు ఉంది. కాబ‌ట్టి నాయ‌క‌త్వం విష‌యంలో రహ‌నేను త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీల్లేదు. 

ఇక ఐపీఎల్ లో కూడా రాహుల్ కెప్టెన్సీది ఫెయిల్యూర్ రికార్డే. క్రితం సీజ‌న్ లో పంజాబ్ కెప్టెన్ గా రాహుల్ ట్రాక్ రికార్డును గ‌మ‌నిస్తే, అన్ని మ్యాచ్ ల‌లోనూ మంచి స్థితిలో ఉండి కూడా ఓట‌మి త‌ప్ప‌లేదు ఆ జ‌ట్టుకు! అంతా బాగానే క‌నిపించినా విజ‌యాలు ద‌క్క‌లేదు. ఐపీఎల్ టేబుల్ లో ఆరోస్థానంలో నిలిచింది రాహుల్ కెప్టెన్సీ వ‌హించిన పంజాబ్ జ‌ట్టు. అయితే ఇప్పుడు రాహుల్ కు ఐపీఎల్ విష‌యంలో మ‌ళ్లీ మంచి ఒప్పందం ద‌క్కింది. 

కొత్త జ‌ట్టుకు 17 కోట్ల రూపాయ‌ల రెమ్యూనిరేష‌న్ తో రాహుల్ కెప్టెన్ అవుతున్నాడు. ఐపీఎల్ సంగ‌తెలా ఉన్నా.. జాతీయ జ‌ట్టు కెప్టెన్సీ విష‌యంలో మాత్రం ఇక‌పై రాహుల్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం విష‌యంలో బీసీసీఐ పున‌రాలోచించాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. రోహిత్ శ‌ర్మ‌కు ఫుల్ కెప్టెన్ గా వ‌చ్చినా, ఫిట్ నెస్ స‌మ‌స్య‌ల‌తో ఉండే శ‌ర్మ త‌ప్పుకునే సంద‌ర్భాలు ఉండ‌నే ఉంటాయి కాబ‌ట్టి, మ‌రో నాయ‌కుడిని బీసీసీఐ రెడీ చేయాల్సిన అవ‌స‌రం ఉన్న‌ట్టుంది.