ఉద్యోగులు మా మంచి వారు…అంతా బాబే ….?

ప్రభుత్వ ఉద్యోగులు మంచి వారు. వారిలో ఎవరికీ కూడా జగన్ ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేదని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ ఎస్ ఎ రహమాన్ అంటున్నారు. జగన్ కి…

ప్రభుత్వ ఉద్యోగులు మంచి వారు. వారిలో ఎవరికీ కూడా జగన్ ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేదని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ ఎస్ ఎ రహమాన్ అంటున్నారు. జగన్ కి సైతం ఉద్యోగులు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు మేలు చేయాలనే ఎపుడూ జగన్ చూస్తారని ఆయన అన్నారు. అలాగే, ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు జగన్ ప్రభుత్వానికే ఉందని ఆయన అన్నారు.

అయితే ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య చిచ్చు పెట్టడానికి చంద్రబాబు చూస్తున్నారని, కొందరు ఉద్యోగ నేతల విషం నింపాలని ఆయన చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఉద్యోగులతో ప్రభుత్వానికి ఉన్న మంచి సంబంధాలను చెడగొట్టడానికి చంద్రబాబు ఆరాటపడుతున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబులా మాయ మాటలు చెప్పే నైజం జగన్ కి లేదని ఆయన అన్నారు. జగన్ మాట తప్పడని, చెప్పిన మాట మేరకు 27 శాతం ఐఅర్ ని ఇచ్చారని, 18 వేల కోట్లను అందుకోసం బడ్జెట్ లో కేటాయించారని కూడా గుర్తు చేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత‌ కూడా జగన్ కే దక్కింది అని రహమాన్ అన్నారు. సఫాయీవాలాలకు 18 వేల రూపాయల వేతనాన్ని ఇచ్చినదీ  జగవే అని  అన్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని రహమాన్ కోరారు. చంద్రబాబు ట్రాప్ లో అసలు పడవద్దు అని ఆయన సూచించారు. బాబు చెప్పిన మాట ఎపుడూ చేయలేదు అని కూడా రహమాన్ అన్నారు.

ఇదిలా ఉండగా తెలుగుదేశం హయాంలో మైనారిటీలకు తీరని అన్యాయం జరిగిందని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఎ రహమాన్ విమర్శించారు. చంద్రబాబు సీఎం గా ఉండగా ఏకంగా వక్ఫ్ బోర్డు ఆస్తులను తీసుకెళ్ళి హైదరాబాద్ లో తనఖా పెట్టేసారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఆ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి వినతి చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 5,500 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయని వాటిని పరిరక్షించాలని ఆయన కోరారు.

ఇక భీమిలీలో కలాం కల్చరల్ సెంటర్ ని మైనారిటీల కోసం అయిదు కోట్లతో నిర్మించడానికి వైసీపీ సర్కార్ ముందుకు రావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మైనారిటీలకు అన్ని విధాలుగా మేలు చేసేది జగన్ ప్రభుత్వమే అని అన్నారు. ఈ విషయంలో మైనారిటీలకు చంద్రబాబు పూర్తిగా అన్యాయమే చేసారని ఆయన నిందించారు.