ష్…సాక్షి పత్రిక నిద్రపోతోంది….డిస్ట్రబ్ చేయకండి….వాణిజ్య ప్రకటనలకు సంబంధించి నిజానిజాలు సమాజానికి చెప్పడంలో అధికార పార్టీ అనుకూల పత్రిక సాక్షి నిర్లక్ష్య ధోరణిపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వాణిజ్య ప్రకటనల జారీలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్ నేతృత్వంలోని సాక్షి దినపత్రికకు, సాక్షి టీవీకి అధిక ప్రాధాన్య మిస్తున్నారంటూ విజయవాడకు చెందిన కిలారు నాగశ్రవణ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ఈ విషయమై హైకోర్టులో శుక్రవారం రెండో సారి కూడా విచారణకు వచ్చింది.
హైకోర్టులో పిటిషనర్ తరపు దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ…అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ‘ఈనాడు’ పత్రిక కన్నా రెండో స్థానంలోని సాక్షికి అధికంగా ప్రకటనల ఆదాయం ఇచ్చారని, అదేవిధంగా మూడో స్థానంలో ఉన్న ‘ఆంధ్రజ్యోతి’కి అతి తక్కువ ప్రకటనలు ఇచ్చి.. కేవలం వేల సర్క్యులేషన్లో ఉన్న ఆంధ్రప్రభ, ప్రజాశక్తి పత్రికలకు అధికంగా ప్రకటనలు ఇచ్చారంటూ ఆ గణాంకాలను వివరించాడు.
ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరాం వాదనలు వినిపిస్తూ…2014-19 మధ్య కాలంలో ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రకటనలు, మిగిలిన పత్రికలకు ఇచ్చిన ప్రకటనల వివరాల గురించి పిటిషనర్ మాట్లాడ్డం లేదన్నాడు. ఆ వివరాలు ప్రస్తావించే ఉంటే అసలు విషయం తెలిసేదని అన్నాడు. అర్ధసత్యాలను మాత్రమే కోర్టు ముందు ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
సరే కోర్టులో వ్యవహారాలు ఎలా నడుస్తున్నా….జన బాహుళ్యానికి వాస్తవాలేంటో చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి, దానికి మద్దతుగా నిలిచే పత్రికగా సాక్షిపై ఎంతో బాధ్యత ఉంది.
గత ఏడాది మే 23 నుంచి ఈ ఏడాది మార్చి వరకు సమాచారశాఖ, ఇతర శాఖలు కలిసి ఏఏ పత్రికలకు ఎంతెంత మొత్తంలో యాడ్స్ రూపంలో ఇచ్చాయో సమాచార హక్కు చట్టం కింద పూర్తి వివరాలు సేకరించి కోర్టులో పిల్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.100.80 కోట్లతో ప్రకటనలు జారీ చేయగా, సాక్షికి రూ.52.03 కోట్లు ఇచ్చారని పిటిషనర్ పేర్కొన్నాడు. అలాగే ఆంధ్రజ్యోతికి కేవలం రూ.25 లక్షలు మాత్రమే యాడ్స్ రూపంలో ఇచ్చినట్టు పిటిషనర్ పేర్కొన్నాడు.
మరి సాక్షి ఏం చేస్తున్నట్టు? అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టులో వాదించినట్టుగా 2014-19 మధ్య కాలంలో ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రకటనలకు సంబంధించి నిజాలు దాచారు. ఈ నిజాలేంటో సాక్షి ఎందుకు రాయలేదు? సమాచార హక్కు చట్టం కింద చంద్ర బాబు పాలనలో ఏఏ మీడియా సంస్థకు ఎంతెంత మొత్తంలో ప్రజాధనాన్ని కట్టెబెట్టారో రాబట్టి…ప్రజలకు తెలియజేసేందుకు సాక్షికి వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కాదు.
ప్రస్తుతం కోర్టులో ఆ ఇష్యూ నడుస్తున్న సమయంలో నాటి ప్రజాధనం దుర్వినియోగంపై వివరాలను వెల్లడించడంలో ఎందుకింత మొద్దు నిద్ర? సమాచారశాఖను కోరితే 2014-19 యాడ్స్ లెక్కలు చెప్పదా? చంద్రబాబు పాలనలో ఒక్క ఆంధ్రజ్యోతికే రూ.800 కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా కట్టబెట్టారనే విమర్శలు బలంగా ఉన్నాయి. నిజానిజాలేంటో చెప్పేందుకు ఇప్పటికైనా సాక్షి గాఢ నిద్ర నుంచి మేల్కొంటుందా?