cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: వి

సినిమా రివ్యూ: వి

సమీక్ష: వి
రేటింగ్‍: 2.5/5
బ్యానర్‍:
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
తారాగణం: నాని, సుధీర్‍బాబు, అదితిరావ్‍ హైదరి, నివేదా థామస్‍, నరేష్‍, వెన్నెల కిషోర్‍, తలైవాసల్‍ విజయ్‍, రోహిణి తదితరులు
నేపథ్య సంగీతం: తమన్‍
సంగీతం: అమిత్‍ త్రివేది
కూర్పు: మార్తాండ్‍ కె. వెంకటేష్‍
ఛాయాగ్రహణం: పి.జి. విందా
నిర్మాతలు: రాజు-శిరీష్‍-హర్షిత్‍ రెడ్డి
రచన, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ
విడుదల తేదీ: సెప్టెంబర్‍ 5, 2020
వేదిక: అమెజాన్‍ ప్రైమ్‍ వీడియో

నాని, ఇంద్రగంటి మోహనకృష్ణ తమ బాణీ మార్చి సరికొత్త తరహా సినీ వినోదాన్ని అందించే ప్రయత్నం చేసారు. అయితే వారికి ఇది కొత్తేమో కానీ తెలుగు సినిమా ప్రేక్షకులకి ఇది ‘వెరీ.. వెరీ... రొటీన్‍’. తన పాత్రతో సమానమైన ఫుటేజీ వున్న పాత్రను సుధీర్‍బాబు చేయడానికి అభ్యంతరం చెప్పకపోవడం నాని గొప్పతనాన్ని తెలియజేస్తుంది. కథకు అవసరమైనంత మేరకు మాత్రమే కనిపించడానికి, మరో హీరో హీరోయిన్‍తో డ్యూయెట్లు పాడుతోంటే తాను తన తదుపరి హత్యకి రెడీ అవుతూ వుండడానికి నాని వెనకాడలేదు. మామూలుగా చాలా మంది తెలుగు సినిమా హీరోలకు వుండే ఇన్‍సెక్యూరిటీస్‍ తనకు లేవని నాని ఇంతగా పాత్రలో ఒదిగిపోయినపుడు... అతను తీసుకున్న రిస్క్కి తగ్గ స్టఫ్‍ సినిమాలో వుంటే అతనికి జస్టిస్‍ చేసినట్టయ్యేది. 

సుధీర్‍బాబుకి సగటు తెలుగు సినిమా హీరో పాత్ర పరిచయ సన్నివేశాన్నిచ్చారు. మంచి ఫైట్‍ సీన్‍లో కత్తులు తగిలి, చొక్కా చిరిగి.. సిక్స్ ప్యాక్‍ బాడీతో కనిపించడమే కాదు... టైటిల్‍ కార్డస్ యావత్తూ అతడిని ‘సూపర్‍ కాప్‍’గా చూపించే పేపర్‍ కటింగ్స్, మ్యాగజైన్‍ కవర్సే వుంటాయి. ఇమ్మీడియట్‍ సీన్‍లో హీరోయిన్‍ వచ్చి అతనితో ఫ్లర్టింగ్‍ మొదలు పెడుతుంది. పక్కా కమర్షియల్‍ హీరోగిరీ అంతా సుధీర్‍ చేస్తోంటే... నాని సింపుల్‍గా సిగరెట్‍ స్మోక్‍ వెనుక రివీల్‍ అయిపోయి, కనిపించిన మొదటి సీన్లోనే ఒక మర్డర్‍ చేసేస్తాడు. ఆ మర్డర్‍ చేయడమే కాకుండా మన సూపర్‍ కాప్‍కి తనను పట్టుకోమని ఛాలెంజ్‍ విసుర్తాడు. 

నానికి ఇది నిజంగా కొత్త సీను. యాక్టర్‍గా తనకిది కొత్త ఎక్స్పీరియన్సు కావచ్చు. కానీ ఇలాంటి సినిమాలెన్నో చూసేసిన తెలుగు సినిమా ప్రేక్షకుడికి మాత్రం మొదటి సీన్లోనే నానికో ఫ్లాష్‍బ్యాక్‍ వుంటుందని, అక్కడ తనకు కావాల్సిన వారికేదో జరిగిందని, అందుకు కారణమయిన వాళ్లను చంపుకుంటూ పోతున్నాడని ఇట్టే అర్థమైపోతుంది. ఈ రొటీన్‍ వ్యవహారాన్ని ఇంట్రెస్టింగ్‍గా మార్చాలని ఇంద్రగంటికి కూడా అనిపించింది. అందుకే తన మానాన తాను ప్రశాంతంగా మర్డర్లు చేసుకోకుండా, దమ్ముంటే పట్టుకోమని పోలీసాఫీసర్‍ని ఛాలెంజ్‍ చేసాడు. తదుపరి మర్డర్‍ ఎక్కడ చేసేదీ ఈ మర్డర్‍ చేసినపుడే క్లూ వదలడమే కాకుండా ఫోన్‍ చేసి మరీ మిగతా వివరాలు అందిస్తుంటాడు. ఈ క్లూలు ఇవ్వడాలు, దాన్ని పోలీస్‍ అధికారి కనుగొనడాలు ఆసక్తికరంగా వుంటే కనీసం ఆ పార్ట్ అయినా రక్తి కట్టేది. కానీ నాని ఇచ్చిన క్లూస్‍ ఏమిటో కనిపెట్టినపుడు, లేదా వాటిని డీకోడ్‍ చేసినపుడు అన్యాపదంగా నవ్విస్తాయి. థ్రిల్లింగ్‍గా అనిపించాల్సిన సదరు వ్యవహారమంతా సిల్లీగా అనిపిస్తుంది. 

నాని అంత హేమాహేమీలను మర్డర్‍ చేసుకుంటూ పోతున్నా, నెక్స్ట్  మర్డర్‍ చేసేందుకు సిద్ధపడుతున్నా సుధీర్‍ క్యారెక్టర్‍ ఎక్కడా సీరియస్‍గా కనిపించదు. పైగా నివేదా థామస్‍తో రొమాన్స్ చేస్తూ, సహ అధికారి వెన్నెల కిషోర్‍తో జోకులు వేస్తూ జరుగుతోన్న పట్ల అసలు ఇతనికి సీరియస్‍నెస్‍ వుందా అనిపిస్తుంది. మర్డర్స్ చేస్తున్నది నాని కనుక అతనెలాగో పోలీసులకు దొరకడనేది కూడా మన ప్రేక్షక బుర్రలకు తెలుసు కనుక కనీసం దొరికిపోతాడేమో అనే టెన్షన్‍ అయినా పుట్టించాలి. కానీ ఎక్కడా అలాంటి ప్రయత్నమే జరగదు. జరుగుతోన్నది ఎంత సీరియస్‍ వ్యవహారమయినా కానీ స్క్రీన్‍ప్లేలో ఎక్కడా అర్జన్సీ వుండదు. యమ ఫ్లాట్‍గా సాగుతోన్న కథలోకి అసందర్భంగా ఇరికించిన కామెడీ సీన్లు, కమర్షియల్‍ తెలుగు సినిమాలు, డైరెక్టర్లపై సెటైర్లు ఏవీ ఇందులో ఇమడలేదు. 

ఈ కథలో ఆసక్తి కలిగించాల్సినది ఏదైనా వుంటే అది ఫ్లాష్‍బ్యాక్‍ ఘట్టం. ఆ సన్నివేశాన్ని ఎంత ఫ్లాట్‍గా స్టార్ట్ చేయాలో చేసి, నాని ఫాన్స్ కోసం ఒక పాట పెట్టి... ఇంతకీ అసలేం జరిగిందనేది చెప్పకుండా చప్పగా ముగించేసారు. మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత కొసమెరుపులా వచ్చి నాని ఏమి జరిగిందనేది చూపిస్తాడు. ఆ సీన్‍ చూసి చెప్పవచ్చు రైటింగ్‍ పరంగా ఈ చిత్రానికి ఎంత శ్రద్ధ పెట్టి వుంటారని. నాని, సుధీర్‍ క్యారెక్టర్లను లింక్‍ చేస్తూ పెట్టినదంతా కూడా ఫ్లాట్‍గా అలా వెళ్లిపోతుందే తప్ప ఎక్కడా ఎక్సయిట్‍ చేయదు. కనీసం ఫ్లాష్‍బ్యాక్‍ సీన్స్లో అయినా ఎమోషన్‍ పండించినట్టయితే, ఆ సన్నివేశాల్లో నాని, అదితి క్యారెక్టర్ల పట్ల లైకింగ్‍ కలిగేట్టు ఏదైనా చేసినట్టయితే బెటర్‍ అనిపించేదేమో కానీ ఏ దశలోను ‘హాఫ్‍ బేక్డ్’ స్క్రిప్ట్ అనే ఫీలింగ్‍ని ఈ చిత్రం పోగొట్టలేదు. 

ఒక మామూలు సన్నివేశాన్ని అయినా తన నటనతో మరింత బెటర్‍ అనిపించేట్టు చేయగల టాలెంట్‍ వున్న నాని కూడా చాలా చోట్ల తేలిపోయాడంటే స్క్రిప్ట్ ఎంత వీక్‍ అనేది అర్థం చేసుకోండిక. సుధీర్‍ బాబు తనవంతు ప్రయత్నం చేసాడు. హీరోయిన్స్ ఇద్దరికీ ఎక్కువ ప్రాధాన్యం దక్కలేదు. పైపెచ్చు నివేదా థామస్‍ క్యారెక్టర్‍, ఆమె సీన్స్ అన్నీ అసలు కథకు అడ్డం పడడం మినహా ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. అదితిరావ్‍ చాలా తక్కువ నిడివి వున్న పాత్రలో కనిపించింది. తమన్‍ అందించిన నేపథ్య సంగీతం నాని పాత్రను ఆ మాత్రమయినా ఎలివేట్‍ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడిగా ఇంద్రగంటి మోహనకృష్ణ వీకెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. బహుశా ఇది తన కంఫర్ట్ జోన్‍ కాకపోవడం వలనో, లేదా బేసిక్‍ ఐడియాతో ఎక్సయిట్‍ అయిపోయి అర్జంట్‍గా దానిని తెరమీదకు తెచ్చేయాలనే ఆరాటంలోనో ఈ చిత్రంలో అటు రచయితగా, ఇటు దర్శకుడిగా రెండిందాలా విఫలమయ్యాడు.

నిజ్జంగా ‘సినిమా’ చూసి ఎన్నో నెలలు అయిపోయిన ఈ టైమ్‍లో నాని నటించిన సినిమా ఇంట్లో చూసే వీలు చిక్కడం ఏ తెలుగు సినీ ప్రియుడికైనా వరమే. కాకపోతే ఇంతకాలం తర్వాత వచ్చిన చిత్రం ఆ ఎదురు చూపులకు తగ్గట్టుంటే బాగుండేది. ఇంత రొటీన్‍ సినిమా ఓటీటీ ఆప్ట్ చేసుకుని మంచి పని చేసిందనిపిస్తే అది మీ పొరపాటేం కాదు సుమీ.

బాటమ్‍ లైన్‍: రొటీన్‍ రివెంజ్‍!  

గణేష్‍ రావూరి 

 


×