సాక్షి వెబ్‌సైట్‌లో రకరకాల వార్తలు కనిపించాయి. కానీ వాటిలో ఆకర్షించేది, హెడ్డింగ్ చూడగానే షాక్ కలిగించే వార్త ఒకటి దర్శనమిచ్చింది. ‘హైకోర్టు సీజే తీరుపై విచారణరకు ఆదేశించండి’ శీర్షికతో కనిపించిన వార్త ఉపశీర్షికలో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఫిర్యాదు చేసినట్టు ఉంది.
ఈ ఫిర్యాదుకు సంబంధించి ఈనాడు, ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌లలో, పత్రికల్లో ఎక్కడా ఒక్క వాక్యం కూడా కనిపించలేదు. సహజంగా న్యాయస్థానాలకు సంబంధించి నెగిటివ్ వార్తలను మీడియా ప్రచురించడం లేదా ప్రసారం చేయడానికి ఇష్టపడవు. ఎందుకంటే న్యాయస్థానాలతో మనకెందుకులే గొడవ అని చూసీచూడనట్టు మీడియా వ్యవహరిస్తుంది.
కానీ అందుకు భిన్నంగా సాక్షి పత్రిక చివరి పేజీలో ఈ వార్తకు ప్రాధాన్యం ఇచ్చి ప్రచురించారు. ఇక ఆ లేఖ వివరాల్లోకి వెళ్దాం.
హైకోర్టులో కోవిడ్ పరిస్థితులను ఎదుర్కోవడంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీరుపై అంతర్గత విచారణకు ఆదేశించాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ే బాబ్డే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్రన్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ హన్స్‌రాజ్ విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు.
ఆ లేఖలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇన్‌చార్జి రిజస్ట్రార్ జనరల్ బి.రాజశేఖర్ మరణానికి, అలాగే కొందరు హైకోర్టు ఉద్యోగులు కరోనా బారిన పడడానికి జస్టిస్ మహేశ్వరి నిర్లక్ష్యం, నిర్ణయాలే కారణమని పేర్కొనడం సంచలనం రేకెత్తిస్తోంది. ఇటీవల 16 మంది హైకోర్టు ఉద్యోగులు కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.
మే 8న హైకోర్టులో మూసి ఉన్న చిన్న ఎయిర్ కండీషన్డ్ హాల్లో ముగ్గురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిందని, ఇక్కడ కోవిడ్ నిబంధనలు పాటించలేదని తెలిపారు. అలాగే ప్రభుత్వం రూ.2.5 కోట్లతో తీర్చిదిద్దిన నివాస గృహంలో ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వ అతిథిగహంలో మూడు సూట్‌లను ఇప్పటికీ జస్టిస్ మహేశ్వరి ఖాళీ చేయలేదని ఆ లేఖలో ప్రస్తావించారు. దీని వల్ల రాష్ట్రానికి వచ్చే వీఐపీలకు ఇబ్బందికరంగా మారిందని వాపోయారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని పూర్తిస్థాయి అంతర్గత విచారణకు ఆదేశించాలని అభ్యర్థిస్తున్నానంటూ నాలుగు పేజీల లేఖను అతను ముగించారు.
కాగా ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ హన్స్‌రాజ్ కాగా, ప్రెసిడెంట్ ఓ రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి అని సమాచారం. ఈయన జగన్ సర్కార్‌లో ఓ కీలక నామినేటెడ్ పదవిలో కొనసాగుతున్నారని తెలిసింది. మొత్తానికి ఈ లేఖ వల్ల ఏం జరుగుతుందో అనే ప్రశ్న కంటే…హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చర్చకు అవకాశం కల్పించింది. బహుశా లేఖ రాసిన వాళ్ల ఉద్దేశం కూడా అదే కావచ్చు. ఈ లేఖను ప్రచురించిన సాక్షి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇంతకూ సాక్షికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందబ్బా?