అడగ్గానే మానవతా దృక్పథంతో సాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులు కృతజ్ఞతతో సలాం చెప్పారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌లను ఇప్పటికే సస్పెండ్ చేయడంతో అరెస్ట్ కూడా చేశారు. పోలీసులను అరెస్ట్ చేయడాన్ని బీజేపీ తప్పు పట్టిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా తుంగభద్ర పుష్కరాల ప్రారంభానికి ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం కర్నూలుకు వచ్చారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీ గెస్ట్‌హౌస్‌లో ముఖ్యమంత్రిని అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులు కలిశారు.
సలాం కుటుంబ సభ్యులైన అత్త మాబున్నీసా, శంషావలి, సాజిదాలను సీఎం ఓదార్చారు. ఈ సందర్భంగా సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైన దోషులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సలాం అత్త మాబున్నీసా మాట్లాడుతూ తన కుమార్తె సాజిదాకు ఉద్యోగం ఇవ్వాలని సీఎంను కోరారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇస్తానని వెంటనే సీఎం హామీ ఇచ్చారు. అలాగే వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న తన అల్లుడు శంషావలిని అనంతపురం నుంచి నంద్యాలకు బదిలీ చేయాలని సీఎంను కోరారు. జగన్ సానుకూలంగా స్పందించారు.
సీఎం ఆదేశాల మేరకు అనంతపురం డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి నంద్యాల వైద్య ఆరోగ్యశాఖకు శంషావలిని డిప్యుటేషన్‌పై బదిలీ చేస్తూ ఉత్వర్వులు ఇచ్చారు. ఘటన అనంతరం బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేసిన విషయం తెలిసిందే. అడిగిన వెంటనే అండగా నిలిచిన జగన్‌కు ఎంతో రుణపడి ఉంటామని మాబున్నీసా తెలిపారు. సీఎంకు సలాం కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.