తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి అనేక ఘటనల నుంచి తమ్ముడు పవన్‌కల్యాణ్ గుణపాఠాలు నేర్వలేదా? అంటే…లేదనే సమాధానం వస్తోంది. చిరంజీవికి సంబంధించి తాజా ఎపిసోడ్ మరోసారి ఆయన తమ్ముడు పవన్ ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరిస్తోంది. ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా చంద్రబాబు, టీడీపీ ప్రయోజనాల కోసమో పని చేయాలనే సంకేతాల్ని ఎల్లో మీడియా పంపింది. లేదంటే చిరంజీవికి పట్టిన గతే పడుతుందని ఎల్లో మీడియా, దాని వెనుక వున్న టీడీపీ హెచ్చరిస్తున్నాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చిరంజీవి లంచ్ భేటీ అయినప్పటి నుంచి, వాళ్లిద్దరి కలయికపై విష ప్రచారానికి ఎల్లో బ్యాచ్ తెరలేపింది. ఇందులో భాగంగా చిరంజీవికి వైసీపీ రాజ్యసభ ఇస్తుందనే దుష్ప్రచారాన్ని టీడీపీ తన అనుకూల మీడియా ద్వారా తెరపైకి తెచ్చింది. మరోవైపు చిరంజీవి తమ్ముడు పవన్‌కల్యాణ్‌తో రానున్న ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకోవాలనే ప్రయత్నాలు ప్రస్తుతానికి సఫలం కాకపోవడంతో టీడీపీ ఆగ్రహంగా ఉంది.
బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న పవన్‌తో చంద్రబాబు మైండ్ గేమ్ మొదలు పెట్టారు. వన్ సైడ్ లవ్ అంటూ చంద్రబాబు ఆడుతున్న డ్రామాలపై ఇప్పటికే పవన్‌కల్యాణ్ స్పందించారు. ఇలాంటి ప్రచారాల ట్రాప్‌లో పడొద్దని తన పార్టీ శ్రేణులకు పవన్‌కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. జనసేనతో పొత్తు కుదరకపోయినా…కనీసం సానుకూల సంబంధాలు కలిగి ఉన్నారనే సానుభూతితో కాపుల ఓట్లను కొల్లగొట్టి, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే వ్యూహంలో చంద్రబాబు వున్నారు. ఈ నేపథ్యంలో తనకు మెగాస్టార్ చిరంజీవితో సన్నిహిత సంబంధాలున్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఇదే సందర్భంలో జగన్‌తో చిరంజీవి భేటీ కావడాన్ని ఎల్లో టీం జీర్ణించుకోలేకపోతోంది. చిరంజీవి, ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ తమ ప్రయోజనాల కోసం కాకుండా, ప్రత్యర్థులకు ఉపయోగపడేలా ఏ ఒక్క అడుగు వేసినా సహించేది లేదన్నట్టు తప్పుడు కథనాలతో హెచ్చరించడం గమనార్హం. సినిమా సమస్యలపై జగన్‌తో చర్చించేందుకు చిరంజీవి వెళితే… కావాలని తన సొంత ప్రయోజనాల కోసమే ఆయన చర్చించి వచ్చారనే దుష్ప్రచారం చేయడం కేవలం వాళ్లకే సాధ్యమనేది బహిరంగ రహస్యం.
ఎవరినైనా వాడుకుని, వదిలేయడంలో చంద్రబాబు, టీడీపీ తర్వాతే ఎవరైనా. వాటిపై సర్వహక్కులు తమకే ఉన్నాయనేది వారి భావన. అలాంటిది సీఎం జగన్‌తో చిరంజీవి ఒంటరిగా కలవడంతో కాపు సామాజిక వర్గంలో పాజిటివిటీని పంపుతుందనే ఆందోళన ఎల్లో బ్యాచ్‌లో మొదలైంది. ఇదే జరిగితే తమకు రాజకీయంగా నష్టమని టీడీపీ ఆందోళన. అందుకే చిరంజీవిపై తానే దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టి…దాన్ని వైసీపీపై నెట్టడం ఎల్లో మీడియాకే చెల్లింది.
కానీ ఏ రాతల వెనుక ఏ కుట్రలున్నాయో తెలుసుకోలేని అమాయక స్థితిలో పాఠకులు, ఏపీ ప్రజలు లేరనే సంగతిని వారు మరిచినట్టున్నారు. నిజంగా పవన్‌కల్యాణ్‌తో పొత్తు కుదుర్చుకోవాలనే చిత్తశుద్ధే టీడీపీకి ఉంటే, ఆయన ప్రాణంగా ప్రేమించే అన్న చిరంజీవిపై రాజకీయ పదవి ఆశించారనే తప్పుడు కథనాలు రాయిస్తారా? అనే ప్రశ్న వెల్లువెత్తుతోంది.
వైసీపీకి పవన్ వ్యతిరేకంగా ఉన్నారని, ఇది తమకు రాజకీయంగా ఉపయోగపడుతుందనే ఒకే ఒక్క కారణంతో జనసేనానిపై తప్పుడు కథనాలు రాయకుండా ప్రస్తుతానికి వదిలేశారు. గతంలో టీడీపీని కాదని, పవన్‌కల్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తున్న సందర్భంలో ఆయన తల్లి, కుటుంబ సభ్యులపై ఎల్లో మీడియా ఎంతగా దుష్ప్రచారం చేసిందో అందరికీ తెలిసిందే.
ఆ తర్వాత పవన్‌కల్యాణ్ ఏ స్థాయిలో ఎదురు దాడికి దిగారో కూడా తెలుసు. ఒక పత్రికాధిపతి ఏకంగా తనకు పరువు నష్టం కలిగించారని పవన్‌పై న్యాయ పోరాటానికి కూడా దిగారు. అలాంటి వాళ్లు…ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారో పవన్ ఆలోచిస్తే మంచిది. రానున్న రోజుల్లో టీడీపీకి మద్దతు ఇవ్వకుంటే తాజాగా చిరంజీవికి పట్టిన గతే …రేపు తనకూ అని పవన్ గుర్తించి అప్రమత్తం కావాల్సి ఉంది.