ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చిరంజీవి లంచ్ భేటీని కొందరు జీర్ణించుకోలేకున్నారు. అలాగని బహిరంగంగా తమ అసంతృప్తి, ఆక్రోశాన్ని బహిరంగంగా ప్రదర్శించలేని దయనీయ స్థితి. ఇందుకు వారిపై జాలి పడాలి. తమ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా కాకుండా, చంద్రబాబు ప్రయోజనాల కోసం సీపీఐ పనిచేస్తోందనే విమర్శ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్గత సమావేశాల్లో కూడా చంద్రబాబు మనుషులనే ముద్ర నుంచి బయటికి రావాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణలను ఆ పార్టీ ముఖ్య నాయకులు హెచ్చరించిన సంగతి తెలిసిందే.
అయితే వాళ్లలో మాత్రం మచ్చుకైనా మార్పు రావడం లేదు. వస్తుందనే ఆశ కూడా ఆ పార్టీ నాయకుల్లో లేదు. తాజాగా జగన్‌తో చిరంజీవి భేటీపై టీడీపీ అనధికార ప్రతినిధులుగా విమర్శలు ఎదుర్కొంటున్న రామకృష్ణ, నారాయణ స్పందించడం గమనార్హం. మరీ ముఖ్యంగా చిరంజీవిని వైసీపీ రాజ్యసభకు పంపిస్తుందనే దుష్ప్రచారాన్ని సమర్థిస్తున్నట్టు నారాయణ స్పందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నారాయణను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ముందుగా నారాయణ ఏమన్నారు, దానిపై నెటిజన్ల కౌంటర్ ఏంటో తెలుసుకుందాం.
‘మెగాస్టార్ చిరంజీవి నాకు మంచి మిత్రుడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను చిరంజీవి ఒంటరిగా కలిసి అనవసరంగా వివాదంలో పడ్డారు. రాజ్యసభ సీటు నేను ఆశించలేదు.. అంతా అపార్థం చేసుకున్నారంటూ బాధపడుతూ ట్వీట్ చేశారు. నిజమే.. చిరంజీవి చెప్పాడు కాబట్టి ఆ కథనాలలో వాస్తవం లేకపోవచ్చు. కానీ ఊహాగానాలకు దారితీస్తాయా? లేదా? మీరు అలా వెళ్లడం పొరబాటు కదా.. మీ సొంత సమస్య కానప్పుడు.. అసోసియేషన్స్‌ని కలుపుకుపోకుండా మీరు ఒంటరిగా వెళ్లి ఏ విధంగా మాట్లాడతారు? ఎలా పరిష్కారం చేస్తారు? ’ అని నారాయణ హితబోధ చేశారు.
నారాయణ హితబోధపై నెటిజన్ల ఘాటు కౌంటర్ ఏంటంటే…
‘నిజమే నారాయణ గారూ! చిరంజీవి అమాయకుడు. మీలా చంద్రబాబుతో రహస్య మంత్రాంగం జరుపుతూ, ఏపీకి, జగన్ కు వ్యతిరేకంగా పనిచేయగల నేర్పరితనం ఆయనకు లేదు మరి’ అని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తుండడం గమనార్హం. ఇదే చంద్రబాబును ఒంటరిగా కలిస్తే తమరికి ఓకేనా అంటూ మరికొందరు దెప్పి పొడవడం విశేషం. మాట్లాడాల్సిన, చేయాల్సిన పనులు ఎన్నో ఉండగా… అవి వదిలేసి ఎందుకూ పనిరాని అంశాలపై నారాయణ మాట్లాడ్డం ఆయనకే చెల్లిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.