ఆర్వీ రమేశ్ యాదవ్…ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరికోరి ఎమ్మెల్సీ చేశారు. ముందుగా అతను ప్రొద్దుటూరులో ఓ కౌన్సిలర్. చైర్మన్ పదవి ఇవ్వాలని మొదట నిర్ణయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సమీకరణల్లో భాగంగా అనూహ్య మార్పులు చేపట్టడంతో ప్రొద్దుటూరు చైర్మన్ పదవిని రమేశ్ యాదవ్ తృటిలో పోగొట్టుకున్నారు. అయితేనేం… తంతే గారాల బుట్టలో పడిన చందంగా రమేశ్ యాదవ్‌ను ఎమ్మెల్సీ పదవి వరించింది.
అప్పటి నుంచి రమేశ్ యాదవ్‌కు కష్టాలు మొదలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండానే ఎమ్మెల్సీ తెచ్చుకున్నారనే ప్రచారం ఉంది. దీంతో రమేశ్ యాదవ్ నియామకంపై సదరు ఎమ్మెల్యే అసంతృప్తిగా ఉన్నారనేది బహిరంగ రహస్యమే. అంతేకాదు, సీఎం సొంత జిల్లాలో, అది కూడా జగన్ ఎంతో అభిమానంతో ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన రమేశ్ యాదవ్‌కు కొంత కాలం క్రితం చంపుతామనే బెదిరింపులు రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తనకు వచ్చిన బెదిరింపులపై స్వయంగా పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా….ఇంత వరకూ ఏమీ కాలేదంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు.
అధికార పార్టీ ఎమ్మెల్సీకే ఈ దుస్థితి ఎదురైతే, ఇక సామాన్యులు, ప్రతిపక్ష పార్టీల నేతల పరిస్థితిని అంచనా వేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రొద్దుటూరులో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలపై వివాదం తలెత్తింది. ఆ ప్లెక్సీల్లో సీఎం వైఎస్ జగన్, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఫొటోలు మాత్రమే ఉన్నాయని, తమ నాయకుడి ఫొటో లేకపోవడం ఏంటని ఎమ్మెల్యే అనుచరులు, కొందరు కౌన్సిలర్లు నిలదీయడంతో పాటు గొడవకు తెగబడ్డారు.
తమపై సొంత పార్టీ నేతలే దాడికి పాల్పడి, గాయపరిచారని ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ అనుచరులు ప్రొద్దుటూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కథ మలుపు తిరిగింది. తనను గన్‌తో ఎమ్మెల్సీ బెదిరించారని, మాటల్లో చెప్పలేని విధంగా బూతులు తిట్టారంటూ ప్రొద్దుటూరు మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మిదేవి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి జగన్ ఏ విధంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారో అర్థం కాలేదని ఆమె వాపోవడం గమనార్హం.
ఈ వ్యాఖ్యలు ఎమ్మెల్యేకు సంబంధం లేకుండానే రమేశ్ యాదవ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారనే అక్కసు వారిలో బలంగా ఉందనే చర్చకు బలం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఈమెతో పాటు పద్మశాలి కార్పొరేషన్ రాష్ట్ర చైర్‌పర్సన్ జింకా విజయలక్ష్మి, ప్రొద్దుటూరు పట్టణ వైసీపీ మహిళా అధ్యక్షురాలు కోనేటి సునంద, మాజీ అధ్యక్షురాలు గజ్జల కళావతి తదితరులు కడపకు వెళ్లి ఎస్పీ అన్బురాజన్ దృష్టికి ప్రస్తుత ప్రొద్దుటూరు రాజకీయ పరిణామాలను వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు వైసీపీలో అంతర్గత విభేదాలపై కడప ఎస్సీకి వివరించామని చెప్పడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
పార్టీ విషయాలపై పోలీస్ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయడం ఏంటనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. పార్టీలో అంతర్గత విభేదాలుంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని, అలా కాకుండా అందుకు భిన్నంగా కడప ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంలో సదరు కౌన్సిలర్, మహిళా నాయకురాళ్ల వెనుక ఉన్న బలమైన శక్తి ఏంటో అందరికీ తెలుసునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ముమ్మాటికీ పార్టీ వ్యతిరేక చర్యే అనే చర్చ కడప జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. మరీ ముఖ్యంగా సీఎం సొంత జిల్లాలోనే బీసీ వర్గాలు బలంగా ఉన్నప్రొద్దుటూరులో కనీసం పుట్టిన రోజు కూడా సంతోషంగా జరుపుకునే స్వేచ్ఛ లేదా అనే ఆవేదన, ఆక్రోశం ఆయా వర్గాల నుంచి ఎదురు కావడం వైసీపీని ఆందోళనకు గురి చేస్తోంది.
ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్‌ను ప్రొద్దుటూరు నుంచి తరిమి వేయడం అంటే… ముమ్మాటికీ జగన్ నిర్ణయాన్ని, బీసీలను ఆదరించాలనే సంకల్పాన్ని ధిక్కరించడమే అని అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. మరీ ముఖ్యంగా స్వయాన ముఖ్యమంత్రి ఎంపిక చేసిన ఎమ్మెల్సీతో సదరు ప్రజాప్రతినిధి కయ్యానికి దువ్వడం అంటే…నేరుగా జగన్‌తో ఢీ కొట్టడమే అని వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రొద్దుటూరు వైసీపీలో చోటు చేసుకున్న అసమ్మతి ఎలాంటి పరిణామాలు దారి తీస్తాయోనన్న చర్చ కడప జిల్లాలో విస్తృతంగా సాగుతోంది.