ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత అప్రతిష్ట మూటకట్టుకున్న పాలసీ ఏదైనా ఉందా అంటే ….అది ఇసుక సరఫరా అని చెప్పాలి.
అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి మేనిఫెస్టోలో పొందుపరిచిన సంక్షేమ పథకాల అమలుకు జగన్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారనే ప్రశంసలు వచ్చాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఏమైనప్పటికీ … ప్రజలకు తాను వాగ్దానం చేసిన ప్రతి స్కీంను పక్కాగా అమలు చేసేందుకు జగన్ ముందడుగు వేశారని చెప్పొచ్చు.
అయితే ఇసుక సరఫరాలో మాత్రం కావాల్సినంత చెడ్డపేరును ప్రభుత్వం సంపాదించుకుందని చెప్పాలి. గతంలో చంద్రబాబు హయాంలో ఉన్న ఇసుక పాలసీ కంటే మెరుగైనది తీసుకురావాలని భావించిన జగన్ సర్కార్ …. అందుకు తగ్గ యాక్షన్ ప్లాన్ ఏదీ లేకుండా దుందుడుకుతనంతో వ్యవహరించిందనే ఆరోపణలున్నాయి.
కొత్త పాలసీని తయారు చేసుకుని పాత పాలసీని రద్దు చేసి ఉంటే …ప్రభుత్వానికి ఇంత చెడ్డ పేరు వచ్చేది కాదు. కానీ కొత్త పాలసీ ఏదో చెప్పకుండా …. పాత పాలసీని రద్దు చేయడంతో నెలల తరబడి ఇసుక దొరక్క నిర్మాణ రంగంలోని వారు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేక నెలల తరబడి ఆకలిదప్పులు తప్పలేదు.
పోనీ కొత్త పాలసీ వచ్చిన తర్వాతైనా … పరిస్థితి మెరుగు పడిందా అంటే , అదీ లేదు. పొంతలోంచి పొయ్యిలోకి వచ్చిన మాది రైంది. ఈ నేపథ్యంలో నిన్న రాష్ట్ర కేబినెట్ సమావేశమై దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
ఇసుక సరఫరాలో మెరుగైన సంస్కరణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇక మీదట రీచ్ నుంచి స్టాక్ పాయింట్‌కు, అక్కడి నుంచి ప్రజలకు రవాణా చేసే క్లిష్టతరమైన విధానానికి స్వస్తి చెప్పాలని రాష్ట్ర కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయించడం హర్షదాయకం.
అలాగే టన్ను ఇసుక రూ.475కు మించకూడదని నిర్ణయించడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే అంశమనే చెప్పాలి.
కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రంలో మెరుగైన ఇసుక విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక మీదట ఆఫ్‌లైన్‌లోనే ఇసుక పొందే అవకాశం కల్పించనుంది.
రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించడం పారదర్శకతకు నిదర్శనమని చెప్పొచ్చు.
ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రాకుంటే 13 జిల్లాలను మూడు భాగాలుగా విభజించి, టెండర్లు నిర్వహించాలని నిర్ణయించడం కూడా మంచి పరిణామంగా చెప్పొచ్చు. మొత్తానికి పోయిన చోటే వెతుక్కోవడం అంటే ఇదే అని చెప్పొచ్చు.
ఏది ఏమైనా పంతానికి వెళ్లకుండా ప్రజలకు మేలు చేసేలా ఇసుక పాలసీని రూపొందించడం మంచి మార్పుగా చెప్పొచ్చు. ఇసుక పాలసీలో చేతులు కాలాకైనా జగన్ సర్కార్ ఆకులు పట్టుకుంటున్నందుకు అభినందించాల్సిందే.