కడప జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, జగన్ ప్రత్యర్థి ఎస్వీ సతీష్‌రెడ్డి వైసీపీ కండువా కప్పుకోనున్నారు. దీనికి ఈ నెల 13వ తేదీ ముహూర్తం పెట్టుకున్నారు. తాడేపల్లిలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. సతీష్‌రెడ్డి చేరికతో వైసీపీకి పులివెందులలో ఇక తిరుగుండదు. వైఎస్ కుటుంబంపై అలుపెరగని పోరాటం చేస్తున్న సతీష్‌రెడ్డి చివరికి అదే కుటుంబం నీడన సేద తీరాల్సి వస్తోంది.
వేంపల్లి సతీష్‌రెడ్డి కుటుంబానికి పులివెందుల నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. సతీష్‌రెడ్డి అబ్బ (నాయన తండ్రి) సింగారెడ్డి నాగిరెడ్డి అంటే పులివెందుల నియోజకవర్గంలో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో ఆయన నాయకత్వానికి ఎదురు ఉండేది కాదు. 40 ఏళ్ల పాటు వేంపల్లె సర్పంచ్‌గా ఏకగ్రీవంగా పనిచేశారంటే…ఆయన పెద్దరికానికి ఉన్న గౌరవం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
అలాగే న్యాయస్థానాలు పెద్దగా లేని కాలంలో నాగిరెడ్డి పంచాయితీలకు బాగా పేరు ఉండేది. పల్లెల్లో కుటుంబ, ఆస్తి తగాదాలు వస్తే నాగిరెడ్డి దగ్గరికి వెళ్లే వాళ్లు. ఆయన తీర్పు ఎంతో ధర్మబద్ధంగా ఉండేదని ఇప్పటికీ పులివెందుల పల్లెల్లో కథలుకథలుగా చెప్పుకుంటారు. నాగిరెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు, సతీష్‌రెడ్డి తండ్రి అయిన మధుసూదన్‌రెడ్డి కూడా పదేళ్ల పాటు వేంపల్లె సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇక సతీష్‌రెడ్డి యువకుడిగా నాటి అత్యంతశక్తి మంతుడైన వైఎస్ రాజశేఖరరెడ్డిపై టీడీపీ తరపున తలపడుతూ వచ్చారు. వైఎస్ కుటుంబంతో ఢీ అంటే ఢీ అంటూ ఎదురొడ్డి నిలిచారు. టీడీపీ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతూ వచ్చారు. ఇలా వైఎస్సార్‌పై రెండుసార్లు అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమి పాలైనప్పటికీ….రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
వైఎస్సార్ మరణానంతరం ఆయన కుమారుడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌పై సతీష్‌రెడ్డి పోటీకి దిగారు. జగన్‌పై కూడా రెండుసార్లు సతీష్‌రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో, సతీష్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అలాగే మండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చి పులివెందులలో టీడీపీ బలోపేతానికి చంద్రబాబు విశ్వప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
గతంలో సతీష్‌రెడ్డి పులివెందుల నియోజకవర్గానికి సాగునీళ్లు ఇచ్చే వరకు గడ్డం తీయనని ప్రతిజ్ఞ చేసి…చంద్రబాబు వద్ద పంతం సాధించుకున్నారు. 2019లో ఓటమి తర్వాత సతీష్‌రెడ్డి రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. అయితే ఆయన వైసీపీలో చేరుతారనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. వైసీపీలో చేరేందుకు స్థానిక సంస్థల ఎన్నికల వరకు వేచి చూడాల్సి వచ్చింది. సతీష్‌రెడ్డి ఫ్యామిలీకి ఉన్న చరిత్ర దృష్ట్యా ఆయన అవసరాన్ని…మరీ ముఖ్యంగా జగన్‌కు తల్లి విజయమ్మ వివరించారనే ప్రచారం జరుగుతోంది.
దీంతో ఆయన్ను చేర్చుకునేందుకు వైసీపీ పెద్దలు పావులు కదిపారు. సతీష్‌రెడ్డికి మాజీ మంత్రులు ఆర్.రాజగోపాల్‌రెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డిలు దగ్గరి బంధువులు. మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి భార్య..సతీష్‌రెడ్డికి మేనత్త అవుతారు. అలాగే దివాకర్‌రెడ్డి భార్య స్వయాన చిన్నమ్మ(అమ్మ చెల్లి) అవుతారు. ఏ రకంగా చూసినా సతీష్‌రెడ్డి టీడీపీని వీడడం ….ఆ పార్టీకి తీరని లోటని చెప్పొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఒక్కో పెద్ద నాయకుడు టీడీపీని వీడుతుండడాన్ని చూస్తే…చివరికి కడప జిల్లాలో పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.