హాలీవుడ్ లో మొదలై ఆ తర్వాత ఇండియాలో బాగా ఫేమస్ అయిన మీ టూ ఉద్యమం గురించి సినీ తారల స్పందనలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ విషయంలో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. పలువురు హీరోయిన్లే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొందరేమో.. మీ టూ వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందని అంటున్నారు. మరి కొందరేమో ఈ విషయంలో హీరోయిన్లనే నిందిస్తూ ఉన్నారు. కమిట్ అయినప్పుడు కమిట్ అయ్యి ఆ తర్వాత కొందరు మీ టూ అంటున్నారని కొందరు హీరోయిన్లే వ్యాఖ్యానించారు.
ఈ మధ్యనే కాజోల్ మాట్లాడుతూ.. మీటూ తర్వాత మేల్ సెలబ్రిటీల తీరు బాగా మారిందని వ్యాఖ్యానించింది. హీరోయిన్లతో డీల్ చేసే సమయాల్లో మేల్ సెలబ్రిటీలు కొన్ని అడుగులు వెనుక ఉండి మాట్లాడుతున్నారని కాజోల్ చెప్పుకొచ్చింది. అయితే ఇండియన్ మేల్ సెలబ్రిటీలు అంత తేలికగా వెనక్కుతగ్గే టైపేనా? అనేది సందేహమే!
ఇప్పుడు ఈ అంశం గురించినే స్పందించింది కియరా అద్వానీ. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు లీడ్ లో ఉన్న నటీమణుల్లో కియరా ఒకరు. ఇలాంటి నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. అప్పుడే మీ టూ తో మార్పు వచ్చేయలేదన్నట్టుగా మాట్లాడారు. 'మనం పోస్ట్ మీ టూ దశకు చేరుకోలేదు..' అంటూ వ్యాఖ్యానించింది కియరా. ఇంకా ఇప్పుడిప్పుడే వేధింపులు ఎదుర్కొన్న హీరోయిన్లు, మహిళలు స్పందించే పరిస్థితి వచ్చిందని, అప్పుడే మీ టూ విజయవంతం అయిపోలేదన్నట్టుగా కియరా స్పందించింది. ఇంకా ఇండస్ట్రీలోని మగాళ్లు వెనక్కు తగ్గలేదన్నట్టుగా కియరా తేల్చేసింది!