కరోనా వైరస్ గురించి వాస్తవాల కన్నా పుకార్లే మొదటి నుంచి అతిగా ప్రచారానికి నోచుకున్న సంగతి తెలిసిందే. కరోనా విరుగుడు, కరోనాకు చికిత్స అంటూ సోషల్ మీడియాలో ఎవరికి తోచింది వారు పోస్టు చేస్తూ ఉన్నారు. ఇండియాలో ఇలాంటి వాళ్లు చాలా మందే తయారైన సంగతి తెలిసిందే. ఆ వైరస్ సోకితే వచ్చే వ్యాధి లక్షణాలు ఏమిటో కూడా తెలియకపోయినా చాలా మంది వైద్యం గురించి చెప్పేస్తూ ఉన్నారు. వాటిల్లో కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు ఉన్నాయి. అవి ఎప్పుడైనా పాటించదగినవే.
వాటి సంగతలా ఉంటే.. చికెన్ తినండి, మందు తాగండి అంటూ కూడా కొన్ని ప్రచారాలు సాగుతూ ఉన్నాయి. ఇలాంటి ప్రచారాలు మరో రకమైన ప్రభావాన్ని చూపుతున్నట్టుగా ఉన్నాయి. ఇప్పటికే కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో ఒకటి ఇరాన్. అక్కడ కరోనా ప్రభావంతో 237 మంది మరణించినట్టుగా అధికారికంగా ప్రకటించారు. మరో ఏడు వేల మందికి ఈ వైరస్ సోకినట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అక్కడ కరోనా భయాలు మరింత తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకకూడదంటే.. మద్యం తీసుకోవడం ఒక మార్గం అనే ప్రచారాన్ని కొంతమంది నమ్మి అతిగా మద్యం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తమకు కరోనా సోకిందనే అనుమానాలతో, కరోనా సోకుకుండా ముందస్తుగా మద్యం తాగాలనే అపోహతో వారు అతిగా మద్యం తీసుకున్నట్టుగా సమాచారం. తీవ్రంగా తాగడంతో దాదాపు 27 మంది మరణించారట. మద్యం తాగితే కరోనా నుంచి బయట పడవచ్చు, కరోనా రాదు అనే ప్రచారాలను నమ్మి వారు అతిగా మద్యం తాగి ప్రాణాలను పోగొట్టుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.