పిల్లి సుభాష్ చంద్రబోస్.. వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి తిరుగుబాటు చేసే వరకూ ఈయన పేరు ఉమ్మడి ఏపీలో అందరికీ పరిచయం ఏమీ కాదు. వైఎస్ కేబినెట్లో మంత్రే అయినప్పటికీ.. అంత పాపులారిటీ లేదు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి అండదండలు పొందిన వారు ఎంతో మంది ఉంటారు. అయితే ఆయన చనిపోయాకా.. కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఇమేజ్ నే దెబ్బతీయాలని చూసింది. ఆ ప్రయత్నంలో అధిష్టానానికి సహకరించిన వారే ఎక్కువ! ఇక జగన్ తిరుగుబాటు చేశాకా.. జగన్ వెంట నిలిచిన వైఎస్ అనుచరులు, వైఎస్ ఆశీస్సులు పొందిన వాళ్లు తక్కువ మందే. ప్రత్యేకించి మంత్రి పదవులను కలిగిన వారు జగన్ వెంట నడవడానికి ముందుకు రాలేదు.
ఆ పరిస్థితుల్లో జగన్ వెంట నడిచిన మంత్రులు కొండా సురేఖ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస రెడ్డి. బాలినేని అంటే బంధుత్వం. సురేఖ, సుభాష్ చంద్రబోస్ లు మాత్రం జగన్ కోసమని మంత్రి పదవులు కోల్పోయారు. ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన జగన్ పార్టీ అభ్యర్థుల్లో కూడా వీరిద్దరూ ఉన్నారు. సుభాష్ చంద్రబోస్, సురేఖ ఇద్దరూ బై పోల్ లో గెలవలేకపోయారు. విభజనతో సురేఖ జగన్ కు వ్యతిరేకిగా మారారు. ఆమె కథ వేరైంది.
ఉప ఎన్నికల్లో నెగ్గలేకపోయిన సుభాష్ చంద్రబోస్ ఆ తర్వాత సార్వత్రి ఎన్నికల్లోనూ నెగ్గలేకపోయారు. దీంతో జగన్ ఆయనకు పార్టీ తరఫున తొలి తొలి ఎమ్మెల్సీ అవకాశాన్నే ఇచ్చారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆయన నెగ్గలేకపోయారు. అయినా మంత్రి పదవే వరించింది! ఇక మండలి రద్దుతో సుభాష్ చంద్రబోస్ మంత్రి పదవి పోతోంది. ఎమ్మెల్సీ పదవీ పోతుంది, ఈ నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేయడానికీ జగన్ వెంటనే స్కీమ్ రెడీ చేశారు. సుభాష్ చంద్రబోస్ కు ఏకంగా రాజ్యసభ అవకాశమే ఇచ్చేశారు!
ఇక మోపిదేవి వెంకటరమణది కాస్త వేరే కథ. జగన్ కోసం త్యాగం చేయలేదు. అయితే జగన్ పై కేసుల సృష్టి సమయంలో రేగిన రచ్చలో ఆయన మంత్రి పదవిని కోల్పోయారు. జైలు పాలయ్యారు. జగన్, మోపిదేవిలు దాదాపుగా ఒకే సమయంలో జైల్లో ఉన్నారు. అప్పట్లో జగన్ మీద మోపిదేవి తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడంటూ పచ్చ మీడియా ప్రచారం చేసింది. అయితే ఎన్నికల్లో ఓడిన మోపిదేవిని ఎమ్మెల్సీగా చేసి మంత్రిని చేశారు జగన్! ఇప్పుడు ఆయనా పదవులను కోల్పోతుంటే.. వెంటనే ప్రత్యామ్నాయంగా రాజ్యసభ అవకాశాన్నే ఇచ్చారు!
తన వల్ల లేదా తన కోసం మంత్రి పదవులు కోల్పోయిన నేతలకు జగన్ ఇలా వరస అవకాశాలను, ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఇస్తూ ఉన్నారు. తను నమ్మితే, తన విశ్వాసాన్ని పొందితే.. వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో జగన్ ఇలా చాటి చెబుతూ ఉన్నారు. మండలి రద్దుతో… పిల్లి, మోపిదేవిలకు జగన్ తలుపులు మూసేసినా ఎవరూ అడిగే వారు లేరు! అవతల రాజ్యసభ సీట్లకు వందల కోట్లు ఇస్తామనే వ్యాపార వేత్తలు లేకపోలేదు! అయినా.. జగన్ మాత్రం సుభాష్ చంద్రబోస్, మోపిదేవిలకే అవకాశం ఇచ్చారు. ఈ స్టెప్ తో వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేస్తూ ఉన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.