ట్రోలింగ్ పనిచేసింది. తిట్ల దండకం ఫలితాన్నిచ్చింది. ప్రభాస్ అభిమానుల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు అతడి కొత్త సినిమా నుంచి ఓ అప్ డేట్ ఇచ్చింది యూవీ క్రియేషన్స్ సంస్థ. అంతర్జాతీయ టెక్నీషియన్స్ సాయంతో ఓ క్యూట్ ఛేజ్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే మరో భారీ యూరోప్ షెడ్యూల్ ఉందని ట్వీట్ చేసింది.
ఇన్నాళ్లూ లేనిది యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఇలా ఉన్నఫలంగా ప్రభాస్ మూవీపై అప్ డేట్ ఇవ్వడానికి ఓ కారణం ఉంది. అదే ట్రోలింగ్. ఓవైపు ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న ఈ నిర్మాణ సంస్థ.. ఆ సినిమాను పక్కనపెట్టేసి తమ సోషల్ మీడియా వేదికను పూర్తిగా మరో సినిమా కోసం కేటాయించింది. ప్రభాస్ మూవీ అప్ డేట్ కోసం అంతా ఎదురుచూస్తున్న టైమ్ లో ధనుష్ సినిమా ప్రచారాన్ని భుజానికెత్తుకుంది.
దీంతో అభిమానులకు మండింది. ఓ రేంజ్ లో యూవీ క్రియేషన్స్ నిర్మాతల్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇంత ట్రోలింగ్ నడుస్తున్నా యూవీ నిర్మాతలు పట్టించుకోలేదు. భాగ్యశ్రీ, శ్రద్ధాకపూర్, శర్వానంద్ లాంటి వాళ్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతోనే తమ ట్విట్టర్ హ్యాండిల్ ను సరిపెట్టారు. పోస్ట్ పెట్టిన ప్రతిసారి ప్రభాస్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. కొత్త సినిమా అప్ డేట్ ఇవ్వకుండా ఏంటి ఈ సోది అంటూ గట్టిగా పోస్టులు పెట్టారు.
అలా 10 రోజులుగా వస్తున్న విజ్ఞప్తులు, తిట్లను పట్టించుకున్నట్టున్నారు నిర్మాతలు. ఎట్టకేలకు ప్రభాస్ మూవీ అప్ డేట్ ను అందించారు. అంతేకాదు.. ఇకపై రెగ్యులర్ గా ప్రభాస్ మూవీ అప్ డేట్స్ ఇస్తామని కూడా ప్రకటించి ఫ్యాన్స్ లో ఉత్సాహం తీసుకొచ్చారు. ఈ సినిమాకు ఓ డియర్ లేదా రాథేశ్యామ్ అనే టైటిల్ ను పెట్టాలనుకుంటున్నారు.
A cute chase sequence with a terrific international crew has been completed. A long schedule in Europe awaits now. More updates soon! #Prabhas20
— UV Creations (@UV_Creations) March 10, 2020