సేవ్ ఆంధ్రానా…సేవ్ టీడీపా?

టీడీపీని కాపాడేందుకు జాతీయ పార్టీకి చెందిన నాయ‌కులు కూడా చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తుంటారు. ఇది టీడీపీ అధినేత చంద్ర‌బాబు అదృష్టం. కేవ‌లం పార్టీలు వేరే త‌ప్ప‌, వాళ్ల అంతిమ ల‌క్ష్యం మాత్రం టీడీపీని, చంద్ర‌బాబును…

టీడీపీని కాపాడేందుకు జాతీయ పార్టీకి చెందిన నాయ‌కులు కూడా చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తుంటారు. ఇది టీడీపీ అధినేత చంద్ర‌బాబు అదృష్టం. కేవ‌లం పార్టీలు వేరే త‌ప్ప‌, వాళ్ల అంతిమ ల‌క్ష్యం మాత్రం టీడీపీని, చంద్ర‌బాబును మ‌ళ్లీ అధికారంలోకి తీసుకురావ‌డ‌మే. ఇందుకోసం తాముంటున్న పార్టీని బ‌లి పెట్ట‌డానికి కూడా వెన‌కాడ‌రు. ఈ ధోర‌ణిని గ‌త కొన్నేళ్లుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తున్న వాళ్లంద‌రికీ తెలుసు.

తాజాగా టీడీపీని ప‌రిర‌క్షించేందుకు బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆంధ్ర‌ప్రదేశ్‌లో అరాచ‌కాల‌ను చూస్తూ, త‌ట్టుకోలేక సేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంటూ ఓ ఉద్య‌మాన్ని చేప‌ట్టిన‌ట్టు స‌ద‌రు జాతీయ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు చెప్పుకొచ్చారు. ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ కొత్త‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టార‌ని, కొంత స‌మ‌యం ఇవ్వాల‌ని రెండున్న‌రేళ్ల పాటు ఓపిక‌తో ఉన్న‌ట్టు స‌ద‌రు నేత తెలిపారు.

అయితే కాలం గ‌డిచేకొద్దీ వైసీపీ అరాచ‌కాలు పెరిగిపోయాయ‌ని విమ‌ర్శించారు. ఏపీలో అరాచ‌క‌పాల‌న సాగుతోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. విశాఖలో జగదీశ్వరుడు, ఒంగోలులో సుబ్బారావు గుప్తా ఘటనలే వైసీపీ అరాచ‌కానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. దాడుల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని, వాటి కాపీల‌ను త‌న‌కు పంపితే జ‌గ‌న్ ప్ర‌భుత్వ అంతు చూస్తాన‌ని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు. కావున బాధితులు ఎవ‌రైనా [email protected] మెయిల్‌ చేయాలని సూచించారు.

ఇంత‌కూ ఆ నాయ‌కుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను సేవ్ చేయాల‌ని భావిస్తున్నారా లేక త‌న మాతృ పార్టీ టీడీపీని ప‌రిర‌క్షించాల‌ని కొత్త ఎత్తుగ‌డ‌లు వేశారా? అనే ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. మ‌న‌సులో చంద్ర‌బాబును ఆరాధిస్తూ, పైకి మాత్రం మోడీ రెక్క‌ల చాటున ర‌క్ష‌ణ పొంద‌డం ఈ నేత‌ల‌కే చెల్లింద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి నేత‌ల స్వార్థాన్ని బీజేపీ ఎప్ప‌టికి గుర్తిస్తుందోన‌ని సొంత పార్టీలోని కొంద‌రు నాయ‌కులు వాపోతున్నారు.