సీపీఐ, సీపీఎం …రెండు కవల పిల్లల పార్టీలు. పార్టీలు వేరైనా వాటి సిద్ధాంతం ఒకటే. కానీ ఆచరణకు వచ్చే సరికి ఆ రెండు పార్టీల మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. ముఖ్యంతా ఆంధ్రప్రదేశ్‌లో సీపీఐ వ్యవహార శైలిపై చాలా విమర్శలున్నాయి.
సొంత పార్టీలోనే నాయకత్వం అనుసరిస్తున్న ధోరణులపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏపీ సీపీఐ శాఖకు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి మాత్రమే అనే భావన, అసంతృప్తి మిగిలిన ప్రాంతాల్లోని ఆ పార్టీ నేతల్లో బలంగా ఉంది.
నిన్నమొన్నటి వరకు కమ్యూనిస్టులంటే ప్రజల్లో అంతోఇంతో గౌరవం ఉండేది. కార్మిక, కర్షిక , బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాడే పార్టీలుగా వామపక్ష పార్టీలను గుర్తించేవారు. ఇప్పుడు అమరావతి సమస్య తెరపైకి వచ్చిన తర్వాత ముఖ్యంగా సీపీఐ నిజస్వరూరం ఏంటో బట్టబయలైంది.
కమ్యూనిస్టులంటే అమరావతి కేపిటలిస్టుల ప్రయోజనాల కోసం పోరాడే వారిగా సమాజంలో చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై సీపీఐ నేతలకున్న మోజు …చివరికి ఆ పార్టీని ఎక్కడికి దిగజార్చిందంటే …రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం 53 వేల కుటుంబాలకు ఇంటి స్థలాలు ఇస్తామంటే , వద్దనే వరకూ.
ఈ నేపథ్యంలో సీపీఐకి సోదర సీపీఎం ఓ బహిరంగ విజ్ఞప్తి చేయడం ఆసక్తి కలిగిస్తోంది. సీపీఐ చేష్టల్ని సీపీఎం కూడా భరించలేని తనాన్ని మనం ఆ విజ్ఞప్తిలో గమనించొచ్చు.
అమరావతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కూడలిలో సీపీఎం ఆధ్వర్యంలో సభ జరిగింది. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడారు. తెలుగు ప్రజలకు బీజేపీ, జనసేన, వైసీపీ తీరని అన్యాయం చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన సీపీఐకి విజ్ఞప్తి చేశారు.
“సీపీఐకి ఓ విజ్ఞప్తి చేస్తున్నా. టీడీపీ వెనుక వెళ్లొద్దు. కలిసొచ్చే వారితో అమరావతి రాజధానిగా కొనసాగేందుకు ఉద్యమం చేయడానికి రావాలి” అని మధు సూచించారు. రాజధాని అంశంపై టీడీపీతో కాకుండా ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమిస్తోంది.
రాజధాని పేరుతో టీడీపీ చేసిన రియల్ ఎస్టేట్ దందా గురించి బాగా తెలియడం వల్లే ఆ పార్టీకి దూరంగా ఉండాలని సీపీఎం విధానపరమైన నిర్ణయం తీసుకుని తన గౌరవాన్ని కాపాడుకుంటోంది.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇదే సీపీఐ ఓ సిద్ధాంతాన్ని తెర మీదకు తెచ్చిన విషయాన్ని సీపీఎం గుర్తు చేస్తోంది. అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్షం వైసీపీకి సమాన దూరంలో ఉంటూ ఆందోళనలు చేద్దామని అప్పట్లో సీపీఐ ప్రతిపాదించింది. రెండు పార్టీలు కూడా బూర్జువా, కుటుంబ పార్టీలని, వాటి విధానాలు ఒకటేనని…ఇలా ఎన్నెన్నో చెప్పి … ప్రతిపక్ష వైసీపీతో ఏనాడూ కలిసి ఆందోళనలు చేసిన దాఖలాలు లేవు.
ఇప్పుడు మాత్రం టీడీపీ ప్రతిపక్ష పార్టీగా ఉంటే …ఆ సిద్ధాంతం ఏమైందనేది సీపీఐని సీపీఎం ప్రశ్నిస్తోంది. టీడీపీ తోకపార్టీగా ఉండడం ఏంటని బహిరంగంగానే సీపీఎం ప్రశ్నించడం గమనార్హం. సీపీఐకి టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు హితవు చెబితే అర్థం చేసుకోవచ్చు.
కానీ సాటి సోదర పార్టీ సీపీఎంతో బహిరంగంగా హితవు చెప్పించుకోవడం అంటే …అది తీవ్ర అవమానంగా భావించాలని సీపీఐ కార్యకర్తలు వాపోతున్నారు. టీడీపీ తోకపార్టీగా కొనసాగితే …రామకృష్ణ, నారాయణలకు పోయేదేమీ లేదు, పోయేదల్లా మానం, మర్యాద, సిద్ధాంతం అంటూ నిబద్ధతతో బతికే కార్యకర్తల పరువే.