ఎలాగైనా తన హయాంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పట్టుదలతో ఉన్నారు. మరోవైపు ఏ కారణంతో ఎన్నికలను వాయిదా వేశారో, అదే కారణాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. విచారణ పూర్తయి తీర్పు రిజర్వ్‌లో ఉంది.
మరో వైపు ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు స్వీకరించేందుకు ఈ నెల 28న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నేతృత్వంలో సమావేశం జరగనుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం సహకారం తప్పని సరి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి శుక్రవారం తేల్చి చెప్పారు.
తాడేపల్లిలో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నవంబర్‌లో నిర్వహించే పరిస్థితి లేదని మంత్రి గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. కోవిడ్ కొంత వరకు తగ్గినట్టు కనిపిస్తున్నా మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా ఉందన్నారు.
బిహార్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల గురించి ఆయన ప్రస్తావించారు. ఆ రాష్ట్రంలో ఎన్నికలు తప్పని సరి అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కొంత వెసులుబాటు ఉందని మంత్రి పేర్కొన్నారు. అందువల్ల ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉత్పన్నం కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వచ్చే ఏడాది మార్చిలో పదవీ కాలం ముగియనుంది.