దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను తమ ఇంట్లో మనిషిగా భావించే కుటుంబాలు ఎన్నో. ఎందుకంటే ఆయన ప్రవేశ పెట్టిన ఫీజురీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలతో తమ జీవితాల్లో వెలుగులు నింపుకున్న విద్యార్థులు, వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ల చల్లని ఆశీస్సులే వైఎస్ వారసులకు నేడు రాజకీయంగా శ్రీరామ రక్షయ్యాయి.
ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరుతో వైఎస్ షర్మిల తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తండ్రి వర్ధంతిని పురస్కరించుకుని ఇవాళ ఇడుపులపాయలో ఆమె వైఎస్సార్‌కు ఘన నివాళి అర్పించారు. అలాగే సోషల్ మీడియా వేదికగా తనదైన స్టైల్లో ఆయన లేని లోటును భావోద్వేగంగా షర్మిల ఆవిష్కరించారు.
“ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలెదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. I Love & Miss U DAD” అంటూ షర్మిల ఆవేదనతో ట్వీట్ చేశారు.
తండ్రి మరణంతో తాను ఒంటరినయ్యాననే భావన ఆమె ట్వీట్లో ప్రతిబింబించింది. ఈ రోజు బాధతో కన్నీళ్లు కారుస్తుంటే ఓదార్చే, తుడిచే తండ్రి లాంటి హృదయం లేదని ఆమె ట్విటర్ వేదికగా పరోక్షంగా చెప్పుకొచ్చారు.