షర్మిలకు ఆదిలోనే హంసపాదు ?

వైఎస్ షర్మిలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతుందా ? ఏమో చెప్పలేం. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితి గమనిస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఏమిటి ఆమెకు ఎదురయ్యే ఆటంకం ? ఏప్రిల్ 9 షర్మిల ఖమ్మంలో భారీ…

వైఎస్ షర్మిలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతుందా ? ఏమో చెప్పలేం. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితి గమనిస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఏమిటి ఆమెకు ఎదురయ్యే ఆటంకం ? ఏప్రిల్ 9 షర్మిల ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే కదా. 

ఆ సభలోనే పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పింది. పార్టీ విధివిధానాలు నిర్ణయిస్తానని చెప్పింది. బహిరంగ సభ కోసం పోలీసులు అనుమతి ఇచ్చారని కూడా సమాచారం వచ్చింది. సో… ప్రభుత్వపరంగా షర్మిల సభకు అడ్డంకులు ఏమీ లేవు. 

అయితే ఆమె సభకు ఇబ్బందులు ఎదురవుతాయని అనుమానాలు రావడానికి కారణం తెలంగాణలో మళ్ళీ కోరలు చాస్తున్న కరోనా. కేవలం తెలంగాణలోనేకాదు, దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా పంజా విప్పుతోందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈమధ్య ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. 

తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కరోనా నియంత్రణకు కఠినమైన ఆంక్షలు విధించారు. రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నారు. తెలంగాణలోనూ మళ్ళీ లాక్ డౌన్ విధిస్తారేమోనని అనుమానాలు కలుగుతున్నాయి. మళ్ళీ కఠిన ఆంక్షలు, నిబంధనలు అమలు చేయొచ్చు. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. షర్మిల సభ నిర్వహించేనాటికి మళ్ళీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందా? అనే అనుమానులు షర్మిల అనుచరుల్లో కలుగుతున్నాయి. 

ఇప్పటికే పొరుగున ఉన్న మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. ఇంకా అనేక రాష్ట్రాల్లోనూ సత్వర నివారణ చర్యలకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి.  ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడి, ఆయా రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడంలో ఎటువంటి నిర్లిప్తతకు చోటివ్వరాదంటూ సలహా ఇచ్చారు. వాస్తవానికి ఈనెల 22 నుంచి కళాశాలలను తిరిగి  ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది.  కానీ  ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుని పునరాలోచనలో పడింది.

ఇప్పటికే రాష్ట్రంలోని చాలా స్కూళ్లలో కరోనా ప్రతాపం చూపిస్తోంది. దీంతో  8వ తరగతి వరకు పాఠశాలలను మూసేయాలన్న ఆలోచన ఉన్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. పరిస్థితి ఈవిధంగా ఉన్నప్పుడు  వచ్చే నెల 9వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా తాను రాజకీయ అరంగేట్రం చేయాలన్న ఆలోచనతో  ఉన్న షర్మిలకు  అడ్డంకులు కలుగుతాయా ? ఒకవేళ  కేసులు పెరిగిన పక్షంలో ప్రభుత్వం నిబంధనలను విధించే అవకాశం ఉంది. 

ఒకవేళ ఆ పరిస్థితి వస్తే.. మరికొంత కాలం పాటు ఆగాల్సి రావొచ్చు. బహిరంగసభ ఎక్కడ.. ఎలా నిర్వహించాలనే దానిపై ఇప్పటికే పలుమార్లు తనను కలిసిన జిల్లా నాయకులు, ముఖ్యమైన క్యాడర్‌తో వైఎస్‌ షర్మిల సుధీర్ఘంగా చర్చించింది.  

సభా వేదిక నిర్ణయించడానికి  ఆమెకు అత్యంత విశ్వసనీయుడుగా ఉన్న  కొండా రాఘవరెడ్డి కొద్ది రోజుల క్రితం ఖమ్మం వెళ్ళాడు. అక్కడి ఎస్ ఆర్ అండ్ బీజీఎన్నార్  డిగ్రీ కళాశాల మైదానం, దాని పక్కనే ఉన్న  సర్దార్‌ పటేల్‌ స్టేడియం, పెవిలియన్‌ గ్రౌండ్  రాఘవరెడ్డి పరిశీలించారు. వీటిలో ఒకదాన్ని ఎంపిక చేసుకోడానికి వివరాలను తీసుకుని వెళ్లారు. 

కనీసం లక్ష మందికి తగ్గకుండా సభను భారీగా, విజయవంతంగా నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న వైఎస్‌ షర్మిల సూచనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ సభ జరగడం, జరక్కపోవడం కరోనా దయ మీద ఆధారపడివుంది.