జనతా కర్ఫ్యూకు ఏడాది.. మరోసారి లాక్ డౌన్ ముప్పు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. 3 రోజుల్లో ఏకంగా లక్ష కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల్లో 60వేల వాటా కేవలం మహారాష్ట్రదే. దేశంలో నమోదయ్యే ప్రతి 100 కేసుల్లో 62 కేసులు…

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. 3 రోజుల్లో ఏకంగా లక్ష కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల్లో 60వేల వాటా కేవలం మహారాష్ట్రదే. దేశంలో నమోదయ్యే ప్రతి 100 కేసుల్లో 62 కేసులు మహారాష్ట్ర నుంచే. మిగతా రాష్ట్రాలంతా తలా పిడికెడు కేసుల్ని పంచుకుంటున్నాయి. ఏపీ, తెలంగాణ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. 

ముఖ్యంగా తెలంగాణలో కరోనా కేసులతో బడులు, హాస్టల్స్ మూతపడుతున్నాయి. ఇటు ఏపీలో గుంటూరు జిల్లాలో స్కూల్స్ మూతబడ్డాయి కానీ.. మిగతా ప్రాంతాల్లో ధైర్యంగానే నడిపిస్తున్నారు. అయితే పరిస్థితులు పూర్తి అనుకూలంగా మాత్రం లేవు. సెకండ్ వేవ్ ప్రభావాన్ని తప్పించుకోడానికి పాక్షిక లాక్ డౌన్ మినహా ఇంకేవీ ప్రత్యామ్నాయంగా కనిపించడం లేదు.

మహారాష్ట్ర నుంచే మొదలు..దేశంలో రెండో దఫా లాక్ డౌన్ మొదలైతే అది కచ్చితంగా మహారాష్ట్రలోనే ఉంటుంది. శనివారం ఒక్కరోజే మహారాష్ట్రలో 27,126 కేసులు బయటపడ్డాయి. 92 మంది చనిపోయారు. ముఖ్యమంత్రి కొడుకు ఆదిత్య ఠాక్రే కూడా సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పాక్షిక లాక్ డౌన్ అమల్లో ఉంది, రాత్రి కర్ఫ్యూ కూడా నడుస్తోంది. అయినా కూడా అన్ని ప్రాంతాల్లో ఒకేరకంగా నియమాలు లేకపోవడంతో కొత్త కేసులు పెరుగుతున్నాయి.

మహారాష్ట్రతో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాల్లో ఈ భయం మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో కేసులు పెరగడానికి కూడా కారణం అదేనంటున్నారు నిపుణులు. తెలంగాణకు ముప్పు ఉంటే.. కచ్చితంగా ఏపీకి కూడా ఆ భయం ఎక్కువగా ఉంటుంది. దీంతో మరోసారి సరిహద్దులు మూసివేసే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్ర సరిహద్దుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

తొలిదశని గుర్తుకు తెచ్చేలా..? ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు తొలి దశను గుర్తుకు తెస్తున్నాయి. మహారాష్ట్రలో తొలి దశ రికార్డులు మలి దశలో బద్దలవుతున్నాయి. మరో 7 రాష్ట్రాల్లో కూడా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇటీవలే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ప్రధాని వ్యాక్సినేషన్ పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. వ్యాక్సినేషన్ ఎలా జరుగుతోంది, టీకాల వృథాని ఎలా అరికడుతున్నారు అనే విషయాలపై క్లాస్ తీసుకున్నారు.

ఇప్పుడు పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉండటంతో.. మరోసారి ప్రధాని లాక్ డౌన్ షాకివ్వడానికి తెరపైకి వస్తారనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఈసారి సంపూర్ణ లాక్ డౌన్ ఉండకపోవచ్చు. తొలి దశ కరోనా అనుభవాలతో పాక్షిక లాక్ డౌన్ వైపు ప్రభుత్వాలు మొగ్గుచూపే అవకాశం ఉంది.

ఏదేమైనా జనతా కర్ఫ్యూ పాటించి సరిగ్గా ఏడాది పూర్తయిన వేళ, ఇండియాలో మరోసారి కరోనా సెకెండ్ వేర్ మొదలవ్వడం బాధాకరం.