దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ముద్దుల తనయ వైఎస్ షర్మిల. తన కుటుంబానికి బద్ద శత్రువైన మీడియాధిపతి ఆర్కే చానల్ గడప తొక్కి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తున్న నేపథ్యంలో మొట్ట మొదటగా షర్మిలతో ఇంటర్వ్యూ చేయడం, దానికి సంబంధించిన ప్రోమోలు విస్తృతంగా ప్రచారం కావడం సంచలనం కలిగించింది.
ఇంటర్వ్యూలో ఎలాంటి సంచలన, వివాదాస్పద అంశాలు ప్రస్తావనకు వస్తాయోననే ఆందోళన వైసీపీ శ్రేణుల్లో, ఆసక్తి తెలుగు సమా జంలో నెలకుందన్నది వాస్తవం. ఇంటర్వ్యూ ప్రసారమైంది.
వివాదాలకు చోటు లేకుండా షర్మిల చాలా తెలివిగా సమాధానాలు చెప్పడంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే ఈ ఇంటర్వ్యూను జాగ్రత్తగా గమనిస్తే… వైఎస్ జగన్‌ను అన్నా అని సంబోధించడానికి షర్మిల ఇష్టపడలేదన్న వాస్తవాన్ని గ్రహించొచ్చు.
ఇది ఉద్దేశపూర్తకంగా జరిగిందా లేక మరేదైనా కారణమా? అనేది తెలియదు కానీ, ఒకప్పటిలా జగన్ ప్రస్తావన వచ్చినపుడు అన్నా అని మాత్రం ఆమె పిలవకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆర్కే ఇంటర్వ్యూలో జగన్ గురించి ప్రస్తావన వచ్చిన సందర్భాల్లో షర్మిల స్పందన ఏంటో …ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
ఆర్కే: అప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేయడం తదితర అంశాల గురించి తెలుసా?
షర్మిల: లేదన్నా. జగన్‌మోహన్‌రెడ్డి గారు సంతకాల సేకరణ చేయలేదు. ఆయన తరుఫున వేరేవారు చేశారు.
ఆర్కే:మీరు పార్టీ ప్రకటించిన తరువాత మీ అన్న జగన్‌మోహన్‌రెడ్డితో విభేదాలు తారస్థాయికి చేరి, మీరు ఇక్కడికి వచ్చేశారని ప్రచారం జరుగుతోంది..! వాస్తవమేనా?
షర్మిల: నాకు… అన్నకు మధ్య వంద ఉండవచ్చు. వెయ్యి ఉండవచ్చు. అవి కూర్చొని పరిష్కరించుకోలేనివైతే కావు. కానీ నేనిక్కడ పార్టీ పెట్టడానికి కారణం… జగన్‌మోహన్‌రెడ్డి గారు, నేను సేవ చేయాలనుకొంటున్న ప్రాంతాలు వేరు. రాష్ట్రాలు వేరు. (ఇక్కడ ఆర్కే మీ అన్న అని అడగడంతో, అందుకు సమాధానంగా మాత్రమే షర్మిల అన్న అని సంబోధించారనే విషయాన్ని గ్రహించాలి)
ఆర్కే: సజ్జల రామకృష్ణారెడ్డి ‘మేము ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాం. కానీ ఆవిడ వినలేదు. కనుక మాకు… ఆవిడకు రాజకీయంగా ఎలాంటి సంబంధంలేదు’ అని అన్నారు!
షర్మిల: మీరన్నట్టు రామకృష్ణారెడ్డి అన్న ‘సంబంధంలేదు’ అని మాట్లాడినందుకు. నేను రాజకీయాల్లో తొలి అడుగు వేసిన రోజున ‘సంబంధం లేదు’ అన్న పదం వాడారు. అదే జగన్‌మోహన్‌రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్లకు అవసరమైన ప్పుడల్లా అడిగిందల్లా నా శక్తికి మించి చేశాను. పాదయాత్రతో సహా. ఏ సంబంధం ఉందని చేశాను? రక్తసంబంధం ఉందని, నా బాధ్యత అనుకుని చేశాను.
ఈ సమాధానంలో సజ్జల రామకృష్ణారెడ్డి గురించి ఆయన పేరుతో పాటు అన్నా అని అన్నారు. ఇదే సమాధానంలో ‘జగన్‌మో హన్ రెడ్డి గారి’ అని షర్మిల అనడాన్ని ప్రత్యేకంగా గమనించాలి. ‘అన్నా’ అని అనడానికి ఆమెకు మనసు రాలేదు. ఇక్కడే షర్మిల మనసులో బయటకు చెప్పుకోలేని బాధ ఏదో ఉందనే చర్చకు అవకాశం ఇస్తోంది. కానీ ఆ తర్వాత ప్రశ్నకు మాత్రం సమాధానంగా… జగన్‌ను ఉద్దేశించి కొట్టుకున్నా ‘అన్న అలా అనకపోతే మంచిదే. కొట్టుకున్నా అన్నా చెల్లెళ్లమే’ అనే మాటలతో కాస్త ఊరటనిచ్చారు.
‘నేను ఆ రోజు జగన్‌మోహన్‌రెడ్డి గారికి ఎందుకు ప్రచారం చేశాను? ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, నీళ్లు వంటివి ప్రజలకు ఇవ్వడం ముఖ్యమనుకొని, ఆ పార్టీ పేరులో వైఎస్సార్ అన్న పేరు ఉంది కాబట్టి, నిలబడినవాడు తోడబుట్టినవాడు కాబట్టి నేను ప్రచారం చేశాను. అక్కడ జగన్‌ను ఆశీర్వదించారు. ఆయనకు ఐదేళ్లు టైమ్ ఇవ్వండి’
‘జగన్‌కు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను, అమ్మా చేయగలిగింది చేశాం. వాళ్లు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్లకు అవసరం లేదు కదన్నా’
‘ఒకవేళ ఏ కారణంతోనైనా జగన్ గారు సీఎంగా ఉండలేకపోతే అప్పుడు ఆ పార్టీ విధివిధానాలను బట్టి తరువాత ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. నేను ఆ పార్టీలో కనీసం సభ్యురాలిని కూడా కాదు’
‘మొదటి నుంచి నాకొక స్పష్టత అయితే ఉంది. నేను, జగన్ రెండు ప్రాంతాలను ఎంచుకున్నాం. ఆ విషయం జగన్ అర్థం చేసుకున్నాడు కాబట్టే ఒక ప్రాంతానికే పరిమితమయ్యాడు’
ఇలా వివిధ సందర్భాల్లో జగన్‌మోహన్‌రెడ్డి గారు లేదా జగన్ అని షర్మిల పిలవడం ఈ ఇంటర్వ్యూలోని ప్రత్యేకత. జగన్‌పై షర్మిల హార్ట్ ఓపెన్ అయ్యింది. అయితే అది నర్మగర్భంగా ఉందని అర్థం చేసుకోవాలి. అన్నిటికీ మించి ఆర్కేకు ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా జగన్‌పై తన అసంతృప్తి, నిరసనను షర్మిల ప్రదర్శించారని చెప్పొచ్చు.
ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ అనే మీడియా సంస్థ మాట వినడానికే ఇష్టపడని జగన్ మనసుకు విరుద్ధంగా షర్మిల నడుచుకోవడంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. శత్రు పక్షాన చెల్లి చేరిందనే చర్చకు ఆర్కేతో ఇంటర్వ్యూను రాజకీయ విశ్లేషకులు ఉదాహరణగా చెబుతున్నారు.