తన భార్య సునంద పుష్కర్ మరణం పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పై నమోదైన కేసులను ఢిల్లీ సెషన్స్ కోర్టు కొట్టి వేసింది. తగిన ఆధారాలేవీ చూపకపోవడంతో పోలీసులు నమోదు చేసిన వివిధ సెక్షన్లలోని కేసులను కోర్టు కొట్టి వేసింది. దీంతో ఆ కేసుల నుంచి శశిథరూర్ కు విముక్తి లభించినట్టు అయ్యింది.
2014 జనవరిలో సునంత పుష్కర్ ఢిల్లీలో అనుమానాస్పద స్థితిలో మరణించినట్టుగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టు మార్టం రిపోర్టులో ఆమె శరీరంలో డ్రగ్స్ ఆనవాలు ఉన్నట్టుగా నమోదైంది. ఆమె హత్యకు గురయ్యారన్నట్టుగా విచారణ మొదలైంది. అయితే అంతిమంగా పోలీసులు ఆమెది ఆత్మహత్య అని చార్జిషీట్ ఫైల్ చేశారు.
అయితే శశిథరూర్ పై కేసులు నమోదయ్యాయి. మ్యారిటల్ క్రూయాలిటీ, ఆత్మహత్యకు పురిగొల్పడం వంటి నేరాల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. వాటి విచారణ ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో పోలీసులు మోపిన సెక్షన్లకు, అభియోగాలకు తగిన ఆధారాలను చూపనట్టుగా ఉన్నారు. ఈ క్రమంలో శశిపై నమోదైన అభియోగాలను కోర్టు కొట్టివేసింది.
సునంద మరణించిన తర్వాత కూడా శశిథరూర్ వరసగా రెండు సార్లు ఎన్నికల్లో గెలిచారు. ప్రస్తుతం కూడా ఆయన తిరువనంతపురం ఎంపీగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్ సభా పక్ష నేతగా కూడా ఆయన ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. భార్య మరణానికి సంబంధించి నమోదైన కేసుల నుంచి కూడా ఆయనకు విముక్తి లభించడం రాజకీయంగా కూడా చర్చనీయాంశం అవుతోంది.