చిరంజీవి అధ్యక్షతన, ఆయన నివాసంలో టాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖులు సమావేశయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో జరగనున్న భేటీలో ఇండస్ట్రీకి సంబంధించి ఏ అంశాలు లేవనెత్తాలనే అంశంపై మీటింగ్ లో చర్చించారు. ఎన్నో అంశాలు చర్చకొచ్చినప్పటికీ.. అందరూ కామన్ గా ఆమోదించిన అంశం, ఏపీలో టిక్కెట్ రేట్లు పెంచాలనే డిమాండ్.
జగన్ ను కలిసిన మరుక్షణం రాష్ట్రంలో టిక్కెట్ రేట్లు పెంచాలంటూ చిరంజీవి నేతృత్వంలోనే టాలీవుడ్ పెద్దల సంఘం ప్రభుత్వానికి మొరపెట్టుకోబోతోంది. టిక్కెట్ రేట్లు తగ్గించడం వల్ల కలిగే అనర్థాల్ని జగన్ కు విడమర్చి చెప్పబోతోంది. సరిగ్గా ఇక్కడే ఓ కీలకమైన పాయింట్ ఎత్తారు నిర్మాత నట్టికుమార్.
ఏపీలో టిక్కెట్లు రేట్లను తగ్గించడం వల్లనే తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణమండపం లాంటి సినిమాలు ఆడాయని, ఆక్యుపెన్సీ పెరిగి, కలెక్షన్లు వచ్చాయని అన్నారు నట్టికుమార్. భారీగా టిక్కెట్ రేట్లు ఉంటే చిన్న సినిమాలు చూడ్డానికి ప్రేక్షకులు థియేటర్లకు రారని ఆయన వాదించారు. నిజంగా ఈయన లేవనెత్తిన పాయింట్ ఆలోచించదగ్గదే.
టిక్కెట్ రేట్లు భారీగా ఉంటే చిన్న సినిమాలు చూడ్డానికి ఎవ్వరూ మొగ్గుచూపరు. అంత రేటు పెట్టి ఆ సినిమా చూడ్డం అవసరమా అనే భావనలోకి వస్తారు. అదే టిక్కెట్ రేటు అందుబాటులో ఉంటే, సరే ట్రయిలర్ బాగుంది ఓసారి చూద్దాం అనే ఫీలింగ్ తో థియేటర్లలోకి వస్తాడు. ఇదే విషయాన్ని నట్టికుమార్ ఎత్తిచూపారు. కానీ పెద్ద సినిమాలకు ఈ వాదన పూర్తి విరుద్ధం. భారీ బడ్జెట్ తో తెరకెక్కే పెద్ద సినిమాలకు మొదటి వారంలోనే
ఓపెనింగ్స్, కలెక్షన్లు రావాలి. అలా రావాలంటే టిక్కెట్ రేట్లను అమాంతం పెంచాల్సిందే. మరీ ముఖ్యంగా మొదటి వారం రోజులు మరింత అదనంగా పెంచుకునే వెసులుబాటు ఇవ్వాల్సిందే. అప్పుడే పెద్ద సినిమాలు ఒడ్డున పడతాయి. నిర్మాతలు లాభాలు కళ్లజూస్తారు.
ఇలా టిక్కెట్ రేట్ల విషయంలో 2 విరుద్ధమైన వాదనలు తెరపైకొచ్చిన నేపథ్యంలో.. త్వరలోనే జరగనున్న సినీ పెద్దల మీటింగ్ లో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.