మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహిళలెవరూ ఉరికంభం ఎక్కలేదు. ఇప్పుడా రికార్డుల్లోకి ఉత్తరప్రదేశ్‌కు చెందిన షబ్నమ్ అనే మహిళ ఎక్కనుంది. ప్రియుడితో కలిసి కుటుంబానికి చెందిన ఏడుగురిని హతమార్చిన కేసులో షబ్నమ్ మెడకు ఉరితాడు బిగుసుకోనుంది. చావు కోసం ఆమె రోజులు లెక్కించాల్సిన పరిస్థితి.
ఉత్తరప్రదేశ్‌లోని అమ్మోహా ప్రాంతానికి చెందిన షబ్నమ్ ఉన్నత విద్యావంతురాలు. ఇంగ్లీష్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈమెకి సలీం అనే వ్యక్తితో పరిచయం ప్రేమగా మారింది. ఈ సలీం ఐదో తరగతి ఫెయిల్ కావడం గమనార్హం. సలీం, షబ్నమ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇందుకు షబ్నమ్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.
దీంతో కోపోద్రిక్తురాలైన షబ్నమ్ కుటుంబ సభ్యుల ప్రాణాలు తీయడానికి నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ప్రియుడు సలీంతో కలిసి తన కుటుంబానికి చెందిన ఏడుగురిని గొడ్డలితో నరికి ప్రాణాలు తీసింది. అత్యంత అమానవీయమైన ఈ దుర్ఘటన 2008లో చోటు చేసుకుంది. మృతుల్లో షబ్నమ్ తల్లి, తండ్రి, సోదరులు, సోదరి ఉన్నారు.
ఈ కేసులో సలీం, షబ్నమ్‌లకు కిందికోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిపై ప్రేమికులిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానం కూడా కిందికోర్టు తీర్పును సమర్థించింది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు చివరి ప్రయత్నంగా రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. ప్చ్… అక్కడి నుంచి సానుకూల స్పందన రాలేదు. రాష్ట్రపతి తిరస్కరణతో ప్రేమికులిద్దరికీ అన్ని దారులు మూసుకుపోయాయి.
ఈ నేపథ్యంలో ఉరితీతకు మథుర జైలు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. అయితే ఇంకా తేదీ ఖరారు కాలేదు. వీరిని నిర్భయ కేసులో నిందితులను ఉరి వేసిన పవన్ జల్లాదే షబ్నమ్‌నూ ఉరి తీయనున్నారు. స్వాతంత్ర్యానంతరం మొట్టమొదటగా ఉరికంభం ఎక్కనున్న మహిళగా షబ్నమ్ పేరు రికార్డులకెక్కనుండడం గమనార్హం.