కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భ్రష్టుపట్టిపోవడానికి ఒక కారణంగా సిద్ధరామయ్య పేరును ఉదాహరిస్తారు పరిశీలకులు. కాంగ్రెస్ లో సీనియర్లందరినీ పక్కన పెట్టి అధికారం దక్కిన వేళ సిద్దూని సీఎంగా చేశారు సోనియా. అటు బీసీ వర్గాల, ఇటు ముస్లింలకు అనుకూల వ్యక్తిగా సిద్దూని సోనియా ఎంచుకున్నారు. ఐదేళ్లు ఆయనను సీఎంగా కదిలించలేదు.
అవతల బీజేపీ వాళ్లు లింగాయత్ లను, జేడీఎస్ వాళ్లు వక్కలిగను నమ్ముకోగా.. కాంగ్రెస్ వాళ్లు సిద్ధరామయ్య ద్వారా కర్ణాటకలోని జనాభా రీత్యా మూడో పెద్ద కులం కురుబలను, అలాగే మైనారిటీలను నమ్ముకుని రాజకీయం చేశారు. అయితే ఉన్నంతలో ఐదేళ్లలో ఏదో చేసిన సిద్ధరామయ్య ఆఖర్లో లింగాయత్ లతో మత రాజకీయం ఒకటి చేశారు. అది మొదటికే మోసం అయ్యింది.
కాంగ్రెస్ వాళ్లు అధికారం కోల్పోయారు. ఆ తర్వాత ఎలాగో ప్రభుత్వం ఏర్పడింది. అది కూడా సిద్ధరామయ్య వల్లనే కూలిపోయిందనే ప్రచారం ఒకటి ఉంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ సిద్దరామయ్య సీఎల్పీ పదవికి రాజీనామా చేశారు. ఇంతలోనే ఆయన హృదయ సంబంధ ఇబ్బందితో ఆసుపత్రి పాలయ్యారు.
ఆయనకు పరామర్శలు కొనసాగుతూ ఉన్నాయి. కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా వెళ్లి సిద్ధరామయ్యను పరామర్శించారు. ఇక సిద్దరామయ్య చేసిన రాజీనామాను వెనక్కు తీసుకోవాలని అంటూ కాంగ్రెస్ వాళ్లు కోరుతున్నారట. అయితే అందుకు సిద్దూ సానుకూలంగా లేరట. ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయబోతున్నట్టుగా ప్రకటించారట. తను ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి తప్పుకోబోతున్నట్టుగా ఆయన తెలిపారట. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన సిద్దరామయ్య ఈ మేరకు కాంగ్రెస్ వాళ్లకు సమాచారం ఇచ్చారట. ఈ నేపథ్యంలో.. ఆయనను కన్వీన్స్ చేయడానికి కాంగ్రెస్ వాళ్లు ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం.