బాలీవుడ్ లో దబాంగ్ సినిమా సీరిస్ రేపుతున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో దాదాపు పదేళ్ల కిందట దబాంగ్ సినిమా వచ్చింది. దాదాపు అప్పట్లో బాలీవుడ్ ను ఒక ఊపు ఊపింది ఆ సినిమా. చుల్ బుల్ పాండేగా సల్మాన్ నటన, ఆ డ్యాన్సులు.. సంచలనం రేపాయి. అప్పటి వరకూ బాలీవుడ్ వసూళ్ల రికార్డులను షేక్ చేసింది దబాంగ్ సినిమా.
ఈ సినిమా మ్యాజిక్ కేవలం ఉత్తరాదికే పరిమితం కాలేదు. ఆ తర్వాత దాన్ని దక్షిణాది భాషల్లో కూడా రీమేక్ చేశారు. తెలుగులో పవన్ కల్యాణ్, తమిళంలో శింబులు ఆ సినిమాను రీమేక్ చేయగా… అవి కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. వాటితో పాటు.. హిందీ దబాంగ్ కూడా సౌత్ లో ప్రత్యేకంగా ప్రదర్శితం అయ్యింది.
ఆ తర్వాత దానికి సీక్వెల్ వచ్చింది. అది సౌత్ లో అంత పేరు తెచ్చుకోకపోయినా.. హిందీ వరకూ బాగానే ఆడింది. ఇప్పుడు దబాంగ్ పార్ట్ త్రీ రూపొంది, విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో దబాంగ్ గురించి సల్మాన్ ఖాన్ ఒక ఆసక్తిదాయకమైన విషయాన్ని చెప్పాడు.
అదేమిటంటే.. వాస్తవానికి దబాంగ్ ఫస్ట్ పార్ట్ ను కేవలం రెండు కోట్ల రూపాయలతో తీసేద్దామని దర్శకుడు అభినవ్ కశ్యాప్ ప్రతిపాదించాడట. దాన్నొక డార్క్ సినిమాగా తీయాలనేది ఆ దర్శకుడి ఆలోచనట. ఫైట్లే తప్ప, పాటలూ గట్రా ఉండవు. హీరో క్యారెక్టర్ చుల్ బుల్ పాండే పూర్తిగా నెగిటివ్ గా ఉంటుందట మొదట రాసుకున్న దాని ప్రకారం. అయితే ఆ సినిమా నిర్మాత అయిన తన తమ్ముడు మార్పులు చేద్దామన్నాడని దానికి అభినవ్ కూడా ఓకే చెప్పడంతో ఆ తర్వాత దబాంగ్ కథ,కథనాలు మారాయని సల్మాన్ తాజాగా వివరించాడు. రెండు కోట్ల రూపాయల బడ్జెట్ తో హీరో క్యారెక్టర్ నెగిటివ్ ఇదొక డార్క్ సినిమాగా రూపొంది ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో!