నోరు జారితే మర్యాద ఉండదని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. రాజాసింగ్ తనపై చేసిన ఆరోపణలపై శనివారం మీడియా సమావేశంలో శిల్పా చక్రపాణిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో పైకి రావాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా రాజాసింగ్‌కు శిల్పా చక్రపాణిరెడ్డి సవాల్ విసిరారు. వాటి వివరాలు తెలుసుకునే ముందు అసలు వివాదం ఏంటో చూద్దాం.
శ్రీశైలంలోని దుకాణ సముదాయాల్లో ముస్లింలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఇటీవల రాజాసింగ్ ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి ఓ టీమ్ తయారుచేసి, రజాక్ అనే వ్యక్తికి బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు.
శ్రీశైలం చుట్టుపక్కల ముస్లింలకు ఎక్కువ శాతం షాపులు ఇచ్చారని, ఆనాటి టీడీపీ ఎమ్మెల్యే కూడా ఎక్కువగా ముస్లింలకు ఇచ్చారన్నారు. గతంలో శ్రీశైలానికి వెళ్లినప్పుడు చాలా మంది ఫిర్యాదులు చేశారని, గొడ్డు మాంసం, మద్యం, మత్తుపానీయాలు వినియోగిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో శిల్పా చక్రపాణిరెడ్డి స్పందించారు. తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. రాజాసింగ్ ఎప్పుడు వస్తానంటే అప్పుడు శ్రీశైలంలో పెద్దల సమక్షంలో చర్చకు సిద్ధమన్నారు.
తనపై ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామాకు సిద్ధమా? అని రాజాసింగ్‌ను ఎమ్మెల్యే ప్రశ్నించారు. శ్రీశైలంలో ముస్లింలను వెళ్లగొట్టడానికి తామెవరమని, 40 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
రాజాసింగ్ ఆరోపించిన రజాక్ అనే వ్యక్తి 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, తాను కేవలం తొమ్మిదేళ్లుగా మాత్రమే రాజకీయాల్లో ఉన్నట్టు శిల్పా చక్రపాణిరెడ్డి చెప్పుకొచ్చారు.
తనకు బినామీ ఎలా అవుతాడని ఆయన ప్రశ్నించారు. రజాక్ పార్టీ కార్యకర్త మాత్రమేనన్నారు. అనవసర ఆరోపణలు చేస్తే మర్యాదగా ఉండదని రాజాసింగ్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తనను హిందూ ద్రోహిగా ముద్రవేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.