చూడండి.. బిహ‌ర్లో ఇలాంటి ఎమ్మెల్యేలూ ఉంటారు!

బిహార్ అంటే సినిమా వాళ్లు ఒక నిశ్చితాభిప్రాయాన్ని క‌లిగించారు. బిహార్ అంటే కిడ్నాప్ లు, బిహార్ అంటే రౌడీయిజం, ప‌ట్ట‌ప‌గలు తుపాకీలు ప‌ట్టుకు తిరుగుతూ ఉంటారు. బిహార్ రాజ‌కీయ నేత‌లు అంటే.. వాళ్లు దోపిడీ…

బిహార్ అంటే సినిమా వాళ్లు ఒక నిశ్చితాభిప్రాయాన్ని క‌లిగించారు. బిహార్ అంటే కిడ్నాప్ లు, బిహార్ అంటే రౌడీయిజం, ప‌ట్ట‌ప‌గలు తుపాకీలు ప‌ట్టుకు తిరుగుతూ ఉంటారు. బిహార్ రాజ‌కీయ నేత‌లు అంటే.. వాళ్లు దోపిడీ దొంగ‌ల్లా ఉంటారు. బిహార్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రైవేట్ సైన్యాన్ని మెయింటెయిన్ చేస్తూ ఉంటారు.

వాళ్లే భుజానికి తుపాకీ వేలాడేసుకు తిరుగుతూ ఉంటారు… అదొక ఆట‌విక రాజ్యం.. అక్క‌డి జ‌నాలు కూడా దానికి అల‌వాటు ప‌డిపోయారు.. అని సినిమాలు బ‌ల‌మైన అభిప్రాయాన్ని ద‌క్షిణాదిన ఏర్ప‌ర‌చ‌గ‌లిగాయి. బాలీవుడ్ సినిమాలు కూడా బిహార్ ను అలాగే చూపుతుంటాయి. మ‌రి అదే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చోటు చేసుకున్న కొన్ని కొన్ని విష‌యాల‌ను మ‌న సినిమాలు చూప‌వు, మ‌న మీడియా కూడా హైలెట్ చేయ‌దు.

పై ఫొటోలు క‌నిపిస్తున్న వ్య‌క్తి పేరు మెహ‌బూబ్ ఆలం. బ్యాక్ గ్రౌండ్ లో క‌నిపిస్తున్న‌ది అత‌డి ఇల్లు. జ‌నాలు త‌న ఇంటి వ‌ద్ద‌కు వ‌స్తే..ఆ ప్లాస్టిక్ కుర్చీల మీద కూర్చోవాలి. అత‌డి ఇంటి ద‌గ్గ‌ర కారు పార్కింగ్ చేసుకునేంత ప్లేస్ కూడా ఉండ‌దు. ఒక భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు. పిల్లలిద్ద‌రూ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోనే చ‌దువుతున్నారు. అత‌డి ఆస్తి తొమ్మిది ల‌క్ష‌లు చేసే కొంత స్థ‌లం, బ్యాంకులో 30 వేల డిపాజిట్. యాక్సిడెంట్ అయ్యి మూల‌న ప‌డిన ఒక స్కార్పియో!

ఇన్ని వివ‌రాలు ఎందుకు? అంటే.. ఆయ‌న ఒక ఎమ్మెల్యే. తొలి సారి ఎమ్మెల్యే కాదు.. నాలుగో సారి ఎమ్మెల్యేగా నెగ్గాకా అత‌డి బ‌తుకు చిత్రం ఇది! వ‌ర‌స‌గా రెండోసారి, స్థూలంగా నాలుగో సారి ఎమ్మెల్యేగా నెగ్గారు ఆలం. సీపీఐ ఎం-ఎల్ పార్టీ త‌ర‌ఫున విజ‌యాలు సాధించిన ఎమ్మెల్యేల్లో ఒక‌రు ఆలం. మరింత విశేషం ఏమిటంటే.. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో బిహార్ ఎమ్మెల్యేల్లోకెళ్లా అత్య‌ధిక మెజారిటీ సాధించిన నేత ఇత‌డే! 50 వేల‌కు పైగా మెజారిటీని సాధించారు! 

ఒక‌వేళ ఇంత‌టి సాధార‌ణ స్థితిలోని వ్య‌క్తి తొలి సారి ఎమ్మెల్యేగా నెగ్గి ఉంటే ఇక నుంచి సంపాదిస్తాడేమో అనుకోవ‌చ్చు. కానీ.. ఆలం చాలా కాలంగా రాజ‌కీయాల్లో ఉన్నాడు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. అయినా అత్యంత సాధార‌ణ జీవ‌న శైలిని కొన‌సాగిస్తున్నాడు. పిల్ల‌లు కూడా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దువుతున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు.

ఆలంపై కేసులున్నాయి. మ‌ర్ద‌ర్ కేసుతో సహా, దొమ్మీ కేసులు కూడా ఉన్నాయి. వాటిని ప్ర‌స్తావిస్తే.. న‌వ్వుతూ, అధికారంలో ఉన్న వారు పెడితే ఎన్ని కేసుల్లో అయినా బంధీలు చేయ‌గ‌ల‌ర‌ని ఆయ‌న చెబుతున్నారు. బిహార్ నేత‌లంటే ఉన్న అభిప్రాయాల‌న్నింటినీ ప‌టాపంచ‌లు చేసేలా ఉంది ఆలం నేప‌థ్యం. బిహార్ అంటే ఇది కూడా అని సినిమా జ‌నాలు గుర్తించాలి!

జగన్ వెనకడుగు అందుకేనా?