ఇప్పటికే ఎలక్ట్రానిక్ మీడియాని సోషల్ మీడియా బాగా దెబ్బకొట్టింది. కరోనా ఎఫెక్ట్ తో ఈ ప్రభావం మరింత గట్టిగా కనిపిస్తోంది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన కొత్తల్లో, ఆ తర్వాత.. టీవీల్లో రిపీటెడ్ గా కనిపించే వార్తలే.. తెల్లారి పొద్దున పేపర్లో హెడ్ లైన్స్ గా వచ్చేవి. అంత ఇంపార్టెంట్ కాకపోయినా.. అప్పటికే జనాలపై రుద్దీ రుద్దీ వదిలేస్తారు కాబట్టి.. పేపర్లో వాటికి కచ్చితంగా స్పేస్ ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడిదే సీన్ టీవీ ఛానెళ్లలో రిపీట్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న న్యూస్.. సాయంత్రానికి టీవీ ఛానెళ్ల ప్రైమ్ టైమ్ బులిటెన్స్ లో హెడ్ లైన్ గా మారుతోంది. ఒకప్పుడు టీవీ ఛానెళ్లు, న్యూస్ పేపర్ ని శాసించినట్టే.. ఇప్పుడు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాను శాసిస్తోంది. పది మందికి నచ్చిన వార్త ఏంటో సాయంత్రానికి సోషల్ మీడియాతో తెలిసిపోతుంది, డెస్క్ ఇంచార్జికి అది హెడ్ లైన్ అనిపించకపోయినా, సోషల్ మీడియా దెబ్బకి అనివార్యంగా ఆ వార్తకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి.
ఈటీవీ 9PM బులిటెన్ సహా.. మిగతా ఛానెళ్ల ప్రైమ్ టైమ్ బులిటెన్స్ పై కూడా ఈ ప్రభావం గట్టిగా కనిపిస్తోంది. న్యూస్ పేపర్ పేజీల సంఖ్య కరోనా దెబ్బతో సగానికి పడిపోయింది. ఈనాడు సైతం జిల్లా ఎడిషన్లను కేవలం 2పేజీలకి కుదించింది. డెస్క్ లో తగినంత స్టాఫ్ లేక, రిపోర్టింగ్ నుంచి వచ్చే ఫీడ్ చాలక టీవీ ఛానెళ్లు కూడా ట్విట్టర్, ఫేస్ బుక్ పై బాగా ఆధారపడ్డాయి.
ఈనేపథ్యంలో మీడియా అంటే సోషల్ మీడియా అనే అర్థం వచ్చేసింది. ఇన్నాళ్లూ మనకెందుకులే అనుకుని సైలెంట్ గా ఉన్న మెగాస్టార్ లాంటివారు కూడా నేను సోషల్ మీడియాలో అడుగు పెడుతున్నానంటూ ప్రకటించి మరీ బరిలో దిగారంటే.. దీని ప్రభావం రోజురోజుకీ ఎంత పెరిగిపోతోందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా.. ఈ లాక్ డౌన్ టైమ్ లో.. ప్రజలకు కాస్తో కూస్తో ఎంటర్ టైన్ మెంట్, ఇన్ఫో టైన్ మెంట్, న్యూస్ అప్ డేట్స్ ఒక్క సోషల్ మీడియా వల్లే కలుగుతోంది.
కేవలం ప్రజలే కాదు, ఉన్నతాధికారులు కూడా సోషల్ మీడియాలో వచ్చిన సమాచారాన్నే విశ్లేషించుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. మొత్తమ్మీద సోషల్ మీడియా ప్రభావం కరోనాతో పదింతలైనట్టు కనిపిస్తోంది. పనిలో పనిగా అధికారుల హెచ్చరికలు, నిఘాతో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ హవా కూడా బాగా తగ్గింది.