మెయిన్‌స్ట్రీమ్ మీడియాకంటే సోషల్ మీడియా ప్రతి అంశంపై చాలా వేగంగా స్పందిస్తోంది. సోషల్ మీడియా పోస్టు బాగా ట్రెండ్ అవుతున్నదంటే…దాంతో నెటిజన్లు, పబ్లిక్ ఎక్కడో కనెక్ట్ అయ్యారని అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియా పోస్టులలో లాజిక్ కొరవడితే ఎవరూ పట్టించుకోరు. అయితే సామాజిక, రాజకీయ, న్యాయ పరమైన తదితర పరిణామాలపై సోషల్ మీడియా తన సృజనాత్మకతతో అద్భుతంగా స్పందిస్తోంది.
ఒక్క పదం, ఒక్క వాక్యం, ఒకే ఒక్క ఫొటోతో ఎన్నెన్నో భావాలను సోషల్ మీడియా పలకిస్తోంది, ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఒకే అంశంపై విభిన్న రీతుల్లో లోతైన అభిప్రాయాల్ని వ్యక్తం చేసేలా ఉన్న రెండు ఫేస్బుక్ పోస్టుల గురించి మాట్లాడుకుందాం. ఆ ఇద్దరూ కూడా జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వారే కావడం విశేషం.
ధార గోపి అనే సీనియర్ జర్నలిస్ట్ విజయవాడ కేంద్రంగా ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలో పనిచేస్తున్నారు. ఆయన ఫేస్బుక్ వాల్లో ఉన్న ఒక పోస్టు ఆకట్టుకుంటోంది. ఆ పోస్టు ఏంటంటే…
“అగ్ని – వాయువు – గంగ
తప్పంతా అగ్నిదే. అక్కడ అగ్నికి ఏం పని? బాధ్యత ఉండక్కర్లా?
గాలి (వాయువు) కూడా బాధ్యతా రాహిత్యంగా పని చేసింది. అగ్నికి తాను తోడైతే మరింత ప్రమాదం అని స్పృహ లేకపోతే ఎలా?
పైగా అక్కడ అత్యవసర ద్వారం లేదని, రాకపోకలకు ఒకటే దారి అని తెలియకపోతే ఎలా?
అగ్ని, గాలి బాధ్యతారాహిత్యం కనిపిస్తోంది.
ఏదో సమయానికి ఆ అగ్నిమాపక సిబ్బందితో కలిసి గంగ వచ్చింది కాబట్టి నష్టం కొంత తగ్గింది. ఆ సమయంలో గంగ లేకపోతే, గంగ తన బాధ్యత తాను నిర్వర్తించకపోతే ఇంకెంత నష్టం జరిగుండేది?
బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన అగ్ని, గాలి (వాయువు)లను అరెస్టు చేసి హాజరు పర్చండి. హాజరు పర్చలేకపోతే యూనిఫార్మ్ తీసేసి రాజకీయాల్లో చేరిపోండి.
తనవంతు బాధ్యతగా పని చేసిన గంగను అభినందిస్తూ సముచిత స్థానం కల్పించండి.
ఇక ఈ అంశంపై తదుపరి చర్యలు అన్నీ నిలిపివేయండి ”
అలాగే తిరుపతి కేంద్రంగా పనిచేసే ఆదిమూలం శేఖర్ అనే జర్నలిస్టు ఫేస్బుక్ పేజీలో ఓ పోస్టు కూడా ఆలోచింపజేసేలా ఉంది. ఒకట్రెండు వాక్యాల్లోనే అర్థం చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత అన్నట్టుగా లోతైన అవగాహన కలిగించేలా ఉన్న ఆ పోస్టు ఏంటంటే…
“ఈ వాదన ఎలా వుందీ..!
రోడ్డుపైన నిర్లక్యంగా వాహనం నడిపి పది మంది ప్రాణాలు తీస్తాడు ఒకడు…ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టరు మీద, ఇంజినీరు మీద కేసు పెడితేగానీ తన మీద కేసు పెట్టకూడదంటాడు ఆ డ్రైవర్..ఈ వాదన ఎలా వుందీ..!”
అదేంటో గానీ విజయవాడలో ఉన్న గోపి, తిరుపతిలో ఉన్న శేఖర్ ఆవేదన ఒకేలా ఉంది. అయితే తమ ఆవేదన, ఆక్రోశాన్ని వేర్వేరు రూపాల్లో వ్యక్తపరిచారు. ఈ రెండు పోస్టులు రావడానికి నేపథ్యం ఏంటో? ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెటిజన్ల మేధస్సు, సృజనాత్మకతకు ఆకాశమే హద్దు. ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో నేడు వైరల్ అవుతున్నాయి. సృజనాత్మకత ఒకరబ్బని సొత్తు కాదు కదా అంటే ఇదే కదా?