ప్రసిద్ధ లాయర్ ప్రశాంత్ భూషణ్‌కు శిక్ష విధించే విషయమై జరిగిన వాదోపవాదాల సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, అందరూ కోర్టునే విమర్శిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రశాంత్ భూషణ్ క్షమాపణ చెబితే ఏమవుతుందని త్రిసభ్య బెంచ్ ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో మంగళవారం ప్రశాంత్ భూషణ్‌కు శిక్ష ఖరారుపై జరిగిన వాదోపవాదాలు చాలా ఆసక్తికరంగా సాగాయి.
న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు దోషిగా తేల్చింది. కాగా తీవ్రస్థాయి వాదోపవాదాల సమయంలో తాను చేసిన ట్వీట్లను వెనక్కి తీసుకోడానికి గానీ, క్షమాపణ చెప్పడానికి గానీ భూషణ్ నిరాకరించారు.
జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనానికి ప్రశాంత్ భూషణ్ వైఖరి తీవ్ర అసంతృప్తి కలిగించింది. క్షమాపణ చెబితే తప్పేంటని జస్టిస్ మిశ్రా పదేపదే ప్రశ్నించారు. దీనిపై ఆయన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అభిప్రాయాన్ని కోరారు. వేణుగోపాల్ స్పందిస్తూ… ‘ హెచ్చరించి, మందలించి వదిలేయండి. ఆయనకు శిక్ష విధించాల్సిన అవసరం లేదు’ అని తేల్చి చెప్పారు. అటార్నీ జనరల్ అభిప్రాయంతోనూ జస్టిస్ మిశ్రా సంతృప్తి చెందలేదు.
ఈ సందర్భంగా జస్టిస్ మిశ్రా స్పందిస్తూ…‘ఆయన క్షమాపణ చెప్పడానికి తిరస్కరిస్తున్నారు. చేసిన వ్యాఖ్యలనూ ఉపసంహరించుకోరు. అసలు ఏ న్యాయమూర్తినైనా ఆయన వదిలిపెట్టారా? సిట్టింగ్ జడ్జీలను, రిటైరైన వారిని విమర్శిస్తూనే ఉన్నారు. అలాంటపుడు మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి అని మేం చెప్పి ప్రయోజనమేముంది?’ అని ప్రశ్నించారు.
దీనిపై ఏజీ బదులిస్తూ…. ‘ప్రశాంత్ భూషణ్ ప్రజా ప్రయోజన దావాలెన్నింటినో వేసి ఎంతో ప్రజా సేవ చేశారు. ఆయన వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించండి’ అని కోరారు.
ఏజీ వాదనపై జస్టిస్ మిశ్రా స్పందిస్తూ….‘అందరూ కోర్టును విమర్శిస్తూ ఆయన్ను (ప్రశాంత్ భూషణ్) సమర్థిస్తున్నారు, మా అంతట మేం ఆయన వ్యాఖ్యలను తొలగించడమేంటి’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. మొత్తానికి ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణ కేసు దేశస్థాయిలో సంచలనం రేకెత్తిస్తోంది. ఈ కేసు విషయమై ఒక్క న్యాయవ్యవస్థలోనే కాకుండా సామాన్య ప్రజానీకం మధ్య కూడా చర్చనీయాంశం కావడం గమనార్హం.