ప్రతి హీరో కెరీర్ లో ఆగిపోయిన సినిమాలు ఒకటో రెండో కచ్చితంగా ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి చిన్న స్టార్ రాజ్ తరుణ్ వరకు ప్రతి ఒక్కరి కెరీర్ లో ఇలాంటి సినిమాలుంటాయి. అయితే వాటి గురించి మాట్లాడ్డానికి హీరోలెవ్వరూ ఇష్టపడరు. కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అయితే రామ్ చరణ్ మాత్రం ఈ విషయంలో మొహమాటపడలేదు. తన కెరీర్ లో ఆగిపోయిన సినిమా గురించి స్వయంగా తనే బయటపెట్టాడు.
మెగాస్టార్ చిరంజీవికి సైరాలా, రామ్ చరణ్ కు ఏమైనా డ్రీమ్ ప్రాజెక్టు లేదా డ్రీమ్ క్యారెక్టర్ ఉందా అనేది ప్రశ్న. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మంచి డ్రామా మూవీ చేయాలనేది రామ్ చరణ్ సమాధానం. ఈ సందర్భంగా తన కెరీర్ లో ఆగిపోయిన అలాంటి సినిమా గురించి చరణ్ ప్రస్తావించాడు.
“నాకు ఓ మంచి స్పోర్ట్స్ డ్రామా చేయాలనుంది. నిజానికి ఒకప్పుడు ఆర్బీ చౌదరితో నేను మెరుపు అనే సినిమా మొదలుపెట్టాను. అది స్పోర్ట్స్ డ్రామానే. కానీ అనుకోని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి రాలేదు. ఇప్పటివరకు అలాంటి సబ్జెక్ట్ మళ్లీ నా దగ్గరకు రాలేదు.”
ఇలా తన డ్రీమ్ రోల్ ఏంటనే విషయాన్ని బయటపెడుతూనే, ఆగిపోయిన మెరుపు సినిమాను ప్రస్తావించాడు రామ్ చరణ్.
ఆర్ఆర్ఆర్ తర్వాత చేయబోయే సినిమాపై రామ్ చరణ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గౌతమ్ తిన్ననూరి, వంశీ పైడిపల్లి, సందీప్ రెడ్డి వంగ లాంటి పేర్లు తెరపైకొచ్చినప్పటికీ ఏదీ ఫైనలైజ్ కాలేదు. ఇలాంటి టైమ్ లో ఎవరైనా క్రీడా నేపథ్యం ఉన్న సబ్జెక్ట్ తో చరణ్ ను కలిస్తే వర్కవుట్ అవుతుందేమో.