అమెరికాలో కొందరు తెలుగువాళ్లు వణికిపోతున్నారు

అమెరికాలో ఒక వార్త కొంతమందిని నిద్రపోనీయడంలేదు. వారిలో తెలుగువారు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. టెన్షన్లో నాలుగు చుక్కలు వేసుకుని కొంతమంది ఫ్రెండ్స్ కి ఫోన్లో విషయం చెప్పుకుని అసలేం జరిగిందో బయటపడుతున్నారు. ఏ…

అమెరికాలో ఒక వార్త కొంతమందిని నిద్రపోనీయడంలేదు. వారిలో తెలుగువారు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. టెన్షన్లో నాలుగు చుక్కలు వేసుకుని కొంతమంది ఫ్రెండ్స్ కి ఫోన్లో విషయం చెప్పుకుని అసలేం జరిగిందో బయటపడుతున్నారు. ఏ క్షణాన కోర్టు నోటీసులొస్తాయో, ఏ సమయాన జైల్లో పడాల్సొస్తుందో అని వణికిపోతున్నారు. ఇంతకీ విషయమేంటో చూద్దాం. 

2020లో అమెరికా ప్రభుత్వం కోవిడ్ రిలీఫ్ పేరుతో అడిగిన ప్రతి కంపెనీకి అప్పళంగా డబ్బులు దానం చేసింది. ఊరికే పంచిపెడుతున్నారంటే ఉల్లితొక్క కూడా వదలని మన జాతీయులు డబ్బిస్తున్నారంటే ఆగుతారా? ఏ మాత్రం ఆలోచించకుండా దొంగ డాక్యుమెంట్లు పెట్టి మరీ డబ్బు పుచ్చుకున్నారు. 

అలా వచ్చిన దొంగ డబ్బుని చక్కగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టుకుని కూర్చున్నారు. అక్కడితో కథ అయిపోయిందనుకున్నారు. ప్రపంచాన్ని చావుదెబ్బ కొట్టిన కరోనా తమ జీవితాల్ని మాత్రం అద్భుతంగా మార్చేసిందని ఆ వైరస్ మహమ్మారికి రోజూ దండం పెట్టుకుని పొడుకునుంటారు. 

కానీ ఇప్పుడే కథ అడ్డం తిరగడం మొదలుపెట్టింది. 

అమెరికా ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఫ్రాడుగాళ్లని పట్టుకునే పని మొదలుపెట్టింది. ఆ క్రమంలో తెలుగువాడు కాదు కానీ మోహన్ ముకుంద్ అనే ఒకతనను పట్టుబడ్డాడు. తనకొక కంపెనీ ఉందని, అందులో ఉద్యోగులు ఉన్నారని,వాళ్లకి జీతాలివ్వడానికి ఆదుకొమ్మని మొత్తంగా 5.5 మిలియన్ డాలర్ల (41 కోట్ల రూపాయలు) దొంగ లెక్క చూపించి దాంట్లో 1.8 మిలియన్లు మాత్రం పొందగలిగాడు (దాదాపు 14 కోట్ల రూపాయలు). ఇప్పుడు ప్రభుత్వం డేగ కన్ను వేయడంతో అసలితనికి కంపెనీయే లేదని తెలుసుకుని రెండేళ్ల జైలు శిక్ష వేసారు. 

ఈ పరంపరలో రేపో మాపో కచ్చితంగా దొరికిపోతామని ఇలాంటి పనే చేసిన కొందరు తెలుగువాళ్లకి కంటి మీద కునుకు పడట్లేదు. వీరిలో కొందరు ఏకంగా 30-40 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకి గండికొట్టిన మహానుభావులున్నారు. భయపడినంత సేపు భయపడి “ఏముందిలే..రెండేళ్లేగా..జైల్లో ఇట్టే గడిచిపోతుంది. బయటికొచ్చాక జీవితం అనుకున్నట్టే ఉంటుంది కదా” అని సర్ది చెప్పుకుంటున్నారు. 

కానీ కొందరు మాత్రం మరీ కక్కుర్తిగా కోటి రూపాయల లోపు కోవిడ్ రిలీఫ్ ఫండ్ అక్రమంగా పొంది జేబులో వేసుకున్నారు. వాళ్లకి మాత్రం తడిసిపోతోంది. వ్రతం చెడ్డా ఫలితం దక్కాలంటారు. వీళ్లు మాత్రం పెద్దగా మూటగట్టుకున్నదీ లేక, పైగా జైలు కూడా తప్పేట్టులేదని బాత్రూములో కూర్చుని ఏకాంతంగా ఏడుస్తున్నారు. 

ఏ రోజు తమ ఫోటోని మీడియాలో చూడాల్సొస్తుందో, ఏ రోజు తమ పరువు పోతుందోనని తలపట్టుక్కూర్చున్నారు. ఈ బాపతు తెలుగు సోదరులు ప్రస్తుతం డలాస్, బే ఏరియా, న్యూ జెర్సీ ప్రాంతంలో ఉన్నారని ఒక సమాచారం. కొంతమందైతే నెమ్మదిగా దేశం నుంచి జారుకునే ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారు. “అడుసు తొక్కనేల- కాలు కడగనేల” అంటే ఇదే.