దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకుని సతీమణి వైఎస్ విజయమ్మ హైదరాబాద్‌లో తలపెట్టిన ప్రత్యేక కార్యక్రమం రాజకీయ దుమారం రేపుతోంది. రెండు వారాల క్రితం తాడేపల్లికి వెళ్లిన వైఎస్ విజయమ్మ తన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంట్లో మూడురోజులున్నారు. కుమారుడితో చర్చించే ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ఉంటారనే చర్చ జరుగుతోంది.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ హయాంలో మంత్రులుగా, అలాగే దివంగత నేతతో రాజకీయంగా సన్నిహితంగా ప్రయాణించిన నేతలకు విజయమ్మ ఆహ్వానాలు పంపడం విశేషం. విజయమ్మ నుంచి ఆహ్వానం అందుకున్న నేతల్లో …ప్రస్తుతం వేర్వేరు పార్టీల్లో ఉన్నారు.
వైసీపీలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ధర్మాన ప్రసాద్‌రావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తదితర ముఖ్య నేతలున్నారు. వీళ్లలో చాలా మందికి విజయమ్మ నుంచి నేరుగా ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వెళ్లినట్టు తెలుస్తోంది.
దీంతో తమ ఆరాధ్య నాయకుడి సతీమణి ఆహ్వానాన్ని మన్నించి ప్రత్యేక సమావేశానికి వెళ్లాలా? వద్దా? అనే సంశయంలో అధికార పార్టీ నేతలు పడ్డారు. ఈ నేపథ్యంలో విజయమ్మ ఆహ్వానం విషయమై, ఆమె తనయుడు, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టికి కొందరు వైసీపీ ముఖ్య నేతలు తీసుకెళ్లినట్టు సమాచారం. తానే సమావేశానికి వెళ్లడం లేదని, అలాంటప్పుడు అనవసరంగా మీరెందుకెళ్లడం అని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం.
దీంతో సమావేశానికి వెళ్లొద్దనే ఆదేశాలు వైసీపీ అధినేత నుంచి వచ్చినట్టు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విజయమ్మ సమావేశానికి ఏపీ నుంచి వైసీపీ నేతలెవరూ వెళ్లడం లేదని స్పష్టత వచ్చింది. ఇదిలా ఉండగా వైసీపీ గౌరవాధ్యక్షు రాలిగా విజయమ్మ కొనసాగుతుండడం గమనార్హం.