దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆత్మీయ కార్యక్రమ పర్యవేక్షకుడెవరు? అనే ప్రశ్న ఉదయిస్తోంది. విజయమ్మ ఆత్మీయ పర్యవేక్షకుడు శర్మ అనే పేరు వినపడుతోంది. ఈయన వైఎస్సార్‌కు అడిషనల్ పీఎస్‌గా ఉన్నారు. వైఎస్‌తో పరిచయం ఉన్న వారికి శర్మ అంటే తెలియని వాళ్లుండరు.
గతంలో వైఎస్సార్ కార్యక్రమాలకు శర్మ కర్త, కర్మ, క్రియ అని చెప్పేవాళ్లు. వైఎస్సార్‌కు సంబంధించి ప్రతి కార్యక్రమాన్ని అడిషనల్ పీఎస్ శర్మనే ఫైనల్ చేసేవారు. ఈయన కోఆపరేటివ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవారు. వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగారు.
క్రమశిక్షణకు, నమ్మకానికి మారుపేరుగా నిలిచారని చెబుతారు. అప్పట్లో శర్మతో పాటు చారి, సూర్యుడు, ప్రభాకర్‌రెడ్డి, జన్నత్ హుస్సేన్, కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు వైఎస్సార్‌కు వెన్ను దన్నుగా నిలిచారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన కుటుంబంతో ఇప్పటికీ ప్రయాణిస్తున్న వ్యక్తుల్లో శర్మే ముఖ్యుడు.
వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని నాడు వైఎస్సార్ కేబినెట్‌లో పనిచేసిన, అలాగే రాజకీయ సన్నిహితులతో ఆత్మీయ సమావేశం నిర్వహించాలని విజయమ్మ అనుకోవడం, దాన్ని విజయవంతం చేసేందుకు శర్మ క్రియాశీలకంగా పని చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సమావేశానికి ఎవరెవరిని పిలవాలి, వారి సెల్ నెంబర్లు, ఇతరత్రా సమాచారం సేకరించి, వాళ్లలో కొందరితో విజయమ్మ నేరుగా మాట్లాడ్డం, అలాగే మెసేజ్‌లు పంపే కార్యక్రమాలన్నీ శర్మే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని సమాచారం. విజయమ్మ ఆత్మీయ కార్యక్రమంతో పాటు శర్మ గురించి కూడా చర్చ జరుగుతుండడం విశేషం.