వైసీపీ నేత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వెనకేసుకొచ్చారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ నేతల అక్రమాలపై ఒంటికాలిమీద లేచే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి …అక్రమ మైనింగ్‌లో మాగుంటపై కేసు నమోదైనా మద్దతుగా నిలబడడం చర్చకు దారి తీసింది.
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతున్నట్టు కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి తెలియకుండానే ఆయన పేరుతో మైనింగ్ తవ్వకాలకు అనుమతి తీసుకోవడం సంచలనం కలిగిస్తోంది. నీటిపారుదల శాఖ నుంచి అక్రమార్కులు అనుమతులు తీసుకున్నారని ఆరోపణలున్నాయి.
రైతుల ఆందోళనతో పోలీసులు, ఇరిగేషన్ అధికారులు మాఫియాపై దృష్టిసారించారు. అధికార పార్టీకి చెందిన ఎంపీ మాగుంటతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేయడం వైసీపీలో కాక రేపుతోంది. ఇదిలా ఉండగా తన సొంత నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌కు సంబంధించి వైసీపీ ఎంపీ మాగుంటపై కేసు నమోదైనా, ఆయనపై సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సానుభూతి చూపడం గమనార్హం.
ఈ మొత్తం అక్రమాలకు తన ప్రధాన ప్రత్యర్థి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డే క్రియాశీలకంగా వ్యవహరించారనేది సోమిరెడ్డి ఆరోపణ. కాకాణి గోవర్ధన్‌రెడ్డే సొంత పార్టీ ఎంపీ మాగుంటపై తప్పుడు కేసు పెట్టించారని సోమిరెడ్డి ఆరోపించారు.
కాకాణి అనుచరులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకం ఫోర్జరీ చేసి సర్వేపల్లి రిజర్వాయర్ గ్రానైట్ తవ్వకానికి అక్రమ దరఖాస్తు పెట్టుకున్నారని సంచలన ఆరోపణ చేశారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మాగుంటను కేసులో ఇరికించారని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మాగుంటే దరఖాస్తు చేసి ఉంటే పోలీసులు ఎందుకు విచారణ చేయలేదని ఆయన ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది.