న్యాయ‌దేవ‌త అనుగ్ర‌హంతోనే: దేవినేని ఉమ‌

త‌న‌పై ప్ర‌భుత్వం కుట్ర‌లు చేసినా, న్యాయ దేవ‌త అనుగ్ర‌హంతో త‌ను జైలు నుంచి విడుద‌లైన‌ట్టుగా ప్ర‌క‌టించుకున్నారు తెలుగుదేశం నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుతో స‌హా, వివిధ సెక్ష‌న్ల కింద…

త‌న‌పై ప్ర‌భుత్వం కుట్ర‌లు చేసినా, న్యాయ దేవ‌త అనుగ్ర‌హంతో త‌ను జైలు నుంచి విడుద‌లైన‌ట్టుగా ప్ర‌క‌టించుకున్నారు తెలుగుదేశం నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుతో స‌హా, వివిధ సెక్ష‌న్ల కింద న‌మోదైన కేసుల్లో దేవినేని ఉమ ఇటీవ‌లే అరెస్టు అయిన సంగ‌తి తెలిసిందే. 

దేవినేని ఉమ‌ను అరెస్టు చేసిన అనంత‌రం పోలీసులు ఆయ‌న‌ను రాజ‌మండ్రి జైలుకు తర‌లించారు. ఆయ‌న‌ను క‌స్ట‌డీకి కోరుతూ పోలీసులు ఒక పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే ఆ పిటిష‌న్ విచార‌ణ‌కు రాక‌మునుపే హైకోర్టులో ఉమ త‌ర‌ఫున బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు అయ్యింది. 

నిన్న న్యాయ‌స్థానం ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేయ‌గా, ఈ రోజు ఆయ‌న విడుద‌ల అయ్యారు. విడుద‌ల అయిన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. న్యాయ‌దేవ‌త అనుగ్ర‌హం వ‌ల్ల త‌ను విడుద‌ల అయిన‌ట్టుగా చెప్పుకున్నారు.

ప్ర‌భుత్వంపై త‌న పోరాటం ఆగ‌దంటూ కూడా ఆయ‌న ప్ర‌క‌టించుకున్నారు. దేవినేని ఉమ అరెస్టు త‌ర్వాత టీడీపీ తీవ్రంగా స్పందించిన సంగ‌తి తెలిసిందే. ఉమ ప్రాణాల‌కు ముప్పు పొంచి ఉందంటూ టీడీపీ హ‌డావుడి చేసింది. ఈ ఆరోప‌ణ‌ల‌తో ఢిల్లీ స్థాయి రాజ‌కీయ ప్ర‌ముఖుల‌కు లేఖ‌లు రాశారు. 

ఉమ ఫ్యామిలీని చంద్ర‌బాబు నాయుడు ప‌రామ‌ర్శించారు. తెలుగుదేశం పార్టీతో పెట్టుకోవ‌ద్ద‌ని, టీడీపీతో పెట్టుకున్న వాళ్లు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోతారంటూ చంద్ర‌బాబు నాయుడు ఆ సంద‌ర్భంగా శాప‌నార్థాలు పెట్టారు. ఆ త‌ర్వాత పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌కుండానే, పెద్ద‌గా శ్ర‌మ లేకుండానే దేవినేని ఉమ‌కు బెయిల్ ల‌భించి, ఆయ‌న విడుద‌ల అయ్యారు.