కరోనా విలయాన్ని కూడా రాజకీయ స్వలాభం కోసం వాడుకోవడానికి టీడీపీ నాయకులు అస్సలు సిగ్గుపడడం లేదు. సహాయక చర్యల్లో పాల్గొనకపోగా, వాలంటీర్ వ్యవస్థని విమర్శించి సోషల్ మీడియాలో చీవాట్లు తిన్నారు. ఇప్పుడు ఉద్యోగుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ హయాంలో కరువు, తుఫాన్లు వచ్చినా ఉద్యోగులకు ఎప్పుడూ జీతాల్లో కోత పెట్టలేదని, కరోనా ప్రభావం పెద్దగా లేదని చెబుతున్న సీఎం జగన్.. ఉద్యోగుల జీతాలెందుకు తగ్గించారని ప్రశ్నించారు మాజీ మంత్రి సోమిరెడ్డి. వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతోందని మొసలికన్నీరు కార్చారు.
ఇంతకీ సీఎం జగన్ ఉద్యోగుల జీతాలపై చేసిన ప్రకటన.. కనీసం మాజీ మంత్రి సోమిరెడ్డికి అర్థం అయిందా లేదా అనేది అనుమానమే. తెలంగాణలో లాగా జీతాల్లో 50శాతం కోత విధించలేదు ఏపీ సీఎం జగన్. జీతాలను రెండు విడతల్లో ఇస్తామని మాత్రమే చెప్పారు. చంద్రబాబు తనకి ఖాళీ ఖజానా అప్పగించినా.. ఉన్న నిధులన్నీ నవరత్నాల పథకాలకు ఖర్చవుతున్నా.. కరోనా విపత్తుని ఎదుర్కోడానికి మొక్కవోని ధైర్యంతో నిలబడ్డారు జగన్.
ప్రజా ప్రతినిధుల జీతాలను ఆపేశారు కానీ, ఉద్యోగులకు జీతాలు కోసేస్తున్నానని ఎక్కాడ చెప్పలేదు. కాస్త వెసులుబాటు కోసం రెండు విడతల్లో చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. ఆర్థికంగా మనకంటే మెరుగైన స్థితిలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనే జీతాల్లో కోత మొదలైంది, కానీ ఏపీలో మాత్రం ఎలాంటి సమస్య లేకుండా జగన్ సర్దుబాటు చేయడానికి సిద్ధమయ్యారు.
తుఫాన్లు, వరదలు, కరువుల్లో కూడా తాము ఒకటో తేదీనే ఉద్యోగస్తులకు జీతాలిచ్చామని గొప్పలు చెప్పుకున్నారు సోమిరెడ్డి. తుఫాన్లు, కరువు.. కేవలం కొన్ని ప్రాంతాలకు సంబంధించిన సమస్య. అలాంటి సమస్యల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులు కాదు, కానీ కరోనా అలా కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలింది. ఇక భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. బ్యాంకులు రుణాలపై మారటోరియం విధించాయి. ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నిధులు సరిపోవు, కొత్త అప్పులు పుట్టవు. అందుకే తెలంగాణ ప్రభుత్వం జీతాల్లో కోత విధించింది. ఏపీ సర్కారు రెండు విడతలుగా చెల్లిస్తామంది.
కరోనాకీ, కరువుకీ తేడా తెలియకుండా మాట్లాడటం టీడీపీ నేతలకే చెల్లింది. ఇప్పటికే సోమిరెడ్డిని సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఇప్పుడు సగం జీతం ఇచ్చి, మిగతా సగం తర్వాత ఇస్తామంటే ఆకలి చావులతో ఉద్యోగులు చచ్చిపోతారా? అసలు బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా సోమిరెడ్డీ!