పొగ పెడుతున్న పెద్దాయన… సోముకు పదవీగండం?

పైకి వాళ్లిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. మనంమనం ఒకే పార్టీ అనుకుంటారు. కానీ ఆ పెద్దాయనకు మాత్రం సోము వీర్రాజు అంటే పడదు. దానికి కారణం పార్టీ కార్యకలాపాలు లేదా ఎజెండానో కాదు. సోము చంద్రబాబుకు…

పైకి వాళ్లిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. మనంమనం ఒకే పార్టీ అనుకుంటారు. కానీ ఆ పెద్దాయనకు మాత్రం సోము వీర్రాజు అంటే పడదు. దానికి కారణం పార్టీ కార్యకలాపాలు లేదా ఎజెండానో కాదు. సోము చంద్రబాబుకు అనుకూలంగా లేకపోవడమే. అందుకే ఇప్పుడు సోము సీటు కిందకు నీళ్లు వస్తున్నాయి. పొమ్మనలేక ఢిల్లీ నుంచి పొగ పెడుతున్నారు. ఇక్కడ సోము ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే టీడీపీతో పొత్తు కష్టం. అందుకే ఆయన్ను తప్పించి, చంద్రబాబుకు అనుకూలంగా ఉండే వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టాలనేది పెద్దాయన పన్నాగం. అలా బీజేపీ-టీడీపీ పొత్తుకు లైన్ క్లియర్ చేయడానికి పెద్దాయన రంగంలోకి దిగిపోయారు. ఇటు పవన్ కు కావాల్సింది కూడా ఇదే. బాబుపై ఉన్న ప్రేమను మనసులోనే దాచుకోలేక, బయటకు కక్కలేక ఇబ్బంది పడుతున్న పవన్ కు, సోము వెళ్లిపోతే లైన్ క్లియర్ అయినట్టే. వెళ్లి నేరుగా బాబును వాటేసుకోవచ్చు. ఎంచక్కా ప్రేమించుకోవచ్చు.

ఇటీవల సోము వైరి వర్గం మొత్తం ఓ హోటల్ లో సమావేశం అయిందని, అందులో సోముని అడ్డు తొలగించుకునేందుకు ప్రణాళికలు రచించారనేది తెలిసిన విషయమే. అయితే సోముపై వారికి ఎందుకంత కక్ష, వివాదాల జోలికి వెళ్లకుండా ఉన్న ఆయన్ను ఎందుకు పక్కనపెట్టాలనుకుంటున్నారు. పోనీ సామాజిక సమీకరణాలు కుదరలేదా.. అనే లెక్కలు బయటకొచ్చాయి. కానీ అసలు కారణం చంద్రబాబు అని ఇప్పుడర్థమవుతోంది. సోము సీటు కింద పెద్దాయన ద్వారా చంద్రబాబు మంట పెట్టారనేది ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారింది.

ఏపీలో టీడీపీతో కలిసే ప్రసక్తే లేదు, మాకు పొత్తే లేదంటున్నారు సోము వీర్రాజు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చేది లేదంటూ పవన్ కల్యాణ్ చెప్పిన తర్వాత కూడా ఏపీ బీజేపీ మాట ఇదే. అయితే ఈ విషయంలో కేంద్రం నేరుగా చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటాం అని చెప్పలేదు. స్థానిక సమీకరణాలను బేరీజు వేసుకుని ఏపీ బీజేపీ ఓ ప్రతిపాదన ఇస్తే, అధిష్టానం ఆలోచిస్తుంది. సోము వీర్రాజు ఉండగా అది జరగని పని అని తేలిపోయింది.

చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ కన్నాకు మరోసారి అవకాశం రాదు కాబట్టి.. సోము ప్లేస్ లోకి మరొకరు రావాలి. అయితే అది పద్ధతిగా జరగాలి. సోము వల్ల ఏం ఒరగడంలేదని, ఆ స్థానంలో యువకుడు, ఉత్తరాది రాష్ట్రాల్లో చురుగ్గా పనిచేసిన వ్యక్తికి అవకాశమివ్వాలనే ప్రతిపాదన రావాలి. ఎలాగూ అక్కడ పెద్దాయన మాట కాస్తో కూస్తో చెల్లుబాటవుతుంది కాబట్టి, అందులోనూ సదరు యువకుడిగా చెప్పుకుంటున్న వ్యక్తికి ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి.. ఛాన్స్ దొరకచ్చు.

అందుకే ఆదికి ముందు ఆ పేరు తెరపైకి వచ్చింది. అదే జరిగితే.. 2024 నాటికి బీజేపీని మరింత బలహీనపరిచి, చంద్రబాబుకి జతచేరుస్తారు. సోము కొనసాగితే మాత్రం ఇది కాస్త కష్టంగా మారే అవకాశం ఉంటుంది.