ఏదైనా కారణంతో దంపతులు విడిపోతే… భార్యకు భర్త భరణం ఇవ్వడం చూశాం. కానీ భర్తకు భార్య భరణం ఇవ్వాలని ఓ న్యాయ స్థానం చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఇప్పుడీ తీర్పు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన తీర్పును బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ ఇచ్చింది. ఇంతకూ ఆ తీర్పు కథాకమామీషూ ఏంటో తెలుసుకుందాం.
1992లో ఓ జంటకు వివాహమైంది. భర్త హింసిస్తున్నాడనే కారణంతో 2015లో ఉపాధ్యాయురాలైన భార్య నాందేడ్ సివిల్ కోర్టును ఆశ్రయించింది. కోర్టు విచారించి ఏడాదికి విడాకులు మంజూరు చేసింది. హిందూ వివాహ చట్టం-1995లోని సెక్షన్ 24,25 ప్రకారం భార్య నుంచి శాశ్వత భరణం, జీవనాధార ఖర్చులు ఇప్పించాలని సదరు భర్త పిటిషన్ వేశాడు.
తనకు ఎలాంటి జీవనాధారం లేదని, తన భార్య ఉపాధ్యాయురాలిగా మంచి వేతనం తీసుకుంటున్న న్యాయ స్థానం దృష్టికి తీసుకెళ్లాడు. నాందేడ్ సివిల్ కోర్టు భర్త పిటిషన్‌పై విచారించి సానుకూల తీర్పు వెలువరించింది. నెలకు రూ.3వేలు భరణం ఇవ్వాలని ఉపాధ్యాయురాలైన భార్యను 2017లో నాందేడ్ సివిల్ కోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాలను ఉపాధ్యాయురాలు పట్టించుకోలేదు. తన ఆదేశాలను ధిక్కరించడంపై న్యాయస్థానానికి కోపం వచ్చింది. దీంతో ప్రతి నెలా ఆమె జీతం నుంచి రూ.5వేలు మినహాయించి దాన్ని తమకు పంపాలని కోర్టు స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి 2019లో ఆదేశాలిచ్చింది.
రెండు దఫాలుగా నాందేడ్ సివిల్ కోర్టు తనకు వ్యతిరేక తీర్పులు ఇవ్వడంతో, వాటిపై ఆమె హైకోర్టును ఆశ్రయించింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం ఎప్పుడైనా భరణం కోరుతూ పిటిషన్ వేయవచ్చని భర్త తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు భర్తకు భార్య భరణం ఇవ్వాలని తీర్పు వెల్లడించింది.
ఈ తీర్పు విడాకుల కేసులో ఆసక్తికర పరిణామమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీవనాధారం లేని భర్తలకు భార్యల నుంచి భరణం పొందడానికి భవిష్యత్‌లో ఈ తీర్పు రెఫరెన్స్ కానుంది.