ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, సుజనాచౌదరి, టీజీ వెంకటేష్ పదవీ కాలం ముగిసింది. విజయసాయి రెడ్డి మొదటి నుంచి వైసీపీనే. కానీ టీజీ వెంకటేష్, సుజనా చౌదరిల రాజకీయ పరిస్థితి వేరు. పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఈ ఇద్దరు బీజేపీ నేతలు అదే పార్టీలో కొనసాగుతారా? అనే చర్చకు తెరలేచింది. సుజనాచౌదరి, టీజీ వెంకటేష్ సాంకేతికంగా మాత్రమే బీజేపీ నేతలు, మనసు రీత్యా వాళ్లద్దరూ తెలుగుదేశం పార్టీ వారే.
టీడీపీ తరపున రాజ్యసభకు ఎంపికైన నలుగురు రాజ్యసభ సభ్యులు…కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరిలో సుజనాచౌదరి, టీజీ వెంకటేష్ ఉన్నారు. బీజేపీలో నలుగురు రాజ్యసభ సభ్యులు చేరినా…. వారిపై అనర్హత వేటు వేయాలని ఏనాడూ టీడీపీ ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు.
ఎందుకంటే నలుగురినీ చంద్రబాబే బీజేపీలోకి పంపారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. ఈ ప్రచారానికి టీడీపీ మౌనం బలం కలిగించింది. బీజేపీలో వుంటూ టీడీపీ ప్రయోజనాల కోసం వారు పని చేశారనే ఆరోపణలు లేకపోలేదు.
టీజీ వెంకటేష్ కుమారుడు భరత్ ఇప్పటికీ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్. తండ్రి బీజేపీ, తనయుడు టీడీపీ. ఈ రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇదంతా లోపాయికారి ఒప్పందంలో భాగంగానే జరుగుతోందంటే కాదనగలరా? పదవీ విరమణ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ చంద్రబాబు అంటే తనకు ఎనలేని గౌరవమని అత్యున్నత చట్టసభా వేదికగా చెప్పారు. రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించేందుకు అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు.
ఈ నేపథ్యంలో తమ ఆరాధ్య నాయకుడు చంద్రబాబు చెంతకు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్ చేరుతారా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. మరోసారి సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌కు రాజ్యసభ పదవులు బీజేపీ ఇచ్చే అవకాశం లేదు. పదవులు లేనిదే మనోళ్లకు పొద్దు గడవదు. ఎటూ రాజ్యసభ పదవులు లేవు, ఇక ఏ పార్టీలో వున్నా ఒకటే అని ఆ ఇద్దరు తాజా మాజీలు భావించే పరిస్థితి.
రానున్న ఎన్నికల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు సుజనా, టీజీ ఎక్కడుంటారనేది ఇప్పుడు చర్చ.