బీటెక్ చదివాడు.. డ్రగ్స్ తయారీ నేర్చుకున్నాడు

ఆమధ్య తెలుగులో మత్తువదలరా అనే సినిమా వచ్చింది. అందులో ఒకడు ఏకంగా తన ఇంట్లోనే డ్రగ్స్ తయారుచేస్తుంటాడు. ఓ బెడ్ రూమ్ మొత్తం ల్యాబ్ ఏర్పాటుచేస్తాడు. ఇప్పుడీ సినిమాను వాస్తవరూపంలోకి తీసుకొచ్చాడు ఓ హైదరాబాదీ.…

ఆమధ్య తెలుగులో మత్తువదలరా అనే సినిమా వచ్చింది. అందులో ఒకడు ఏకంగా తన ఇంట్లోనే డ్రగ్స్ తయారుచేస్తుంటాడు. ఓ బెడ్ రూమ్ మొత్తం ల్యాబ్ ఏర్పాటుచేస్తాడు. ఇప్పుడీ సినిమాను వాస్తవరూపంలోకి తీసుకొచ్చాడు ఓ హైదరాబాదీ. తన ఇంటినే ల్యాబ్ గా మార్చి డ్రగ్స్ తయారుచేసి, దందా షురూ చేశాడు. ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నాడు.

సూర్యాపేటకు చెందిన శ్రీరామ్, ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. డ్రగ్స్ కు అలవాటుపడ్డాడు. దీంతో ఉన్న ఉద్యోగం కూడా కోల్పోయాడు. డ్రగ్స్ కు డబ్బుల్లేక ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. తనే మాదకద్రవ్యాలు తయారుచేయాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం అతడు చాలా రీసెర్చ్ చేశాడు.

హిమాలయాలు, రిషికేష్ లాంటి ప్రాంతాలకు వెళ్లి, అక్కడికొచ్చే విదేశీయుల నుంచి డీఎంటీ డ్రగ్ ఎలా తయారుచేయాలో తెలుసుకున్నాడు. ఇక తను స్వయంగా రంగంలోకి దిగాడు. కొన్ని ముడి సరకుల్ని ఆన్ లైన్లో ఆర్డర్ చేశాడు. ఆన్ లైన్లో విక్రయించని కొన్నింటిని హైదరాబాద్ లోనే కొన్నాడు. అడిగితే కాలేజీలో కెమిస్ట్రీ ల్యాబ్ పేరు చెప్పాడు.

మెటీరియల్ సిద్ధంగా ఉంది. మరి ల్యాబ్ ఎక్కడ పెట్టాలి. మరో ఆలోచన లేకుండా జూబ్లిహిల్స్ లోని తన ఇంటినే ల్యాబ్ గా మార్చేశాడు. అలా రెండేళ్లు ప్రయోగాలు చేసి అనుకున్నది సాధించాడు. మాదకద్రవ్యం తయారైంది. ముందుగా తనపైన, తన స్నేహితులపైన ప్రయోగాలు చేశాడు. ఒక గ్రాము డ్రగ్ తో 20 మందికి కిక్కు ఇచ్చేలా, ఆవిరిలా పీల్చుకునే పవర్ ఫుల్ మాదకద్రవ్యాన్ని తయారుచేశాడు.

ఇక అక్కడ్నుంచి దందా షురూ చేశాడు. గ్రాము 8వేల రూపాయలు చొప్పున డ్రగ్స్ అమ్మడంతో పాటు, వాటికి సంబంధించిన పరికరాల్ని కూడా అమ్మడం మొదలుపెట్టాడు. చాలా తొందరగానే పోలీసులకు దొరికాడు. ఇతడి ఇంటిని సోదా చేసిన పోలీసులు, ఇంట్లోనే ల్యాబ్ ఉండడం చూసి అవాక్కయ్యారు. అన్నింటినీ సీజ్ చేసి, శ్రీరామ్ ను జైళ్లో పెట్టారు.