ఊరందరిది ఒకదారైతే ఉలిపికట్టెది మరోదారన్న చందంగా…. ఏపీ సర్కార్ పాలనారీతులున్నాయి. ముఖ్యంగా విద్యాశాఖ అధికారుల విపరీత ధోరణులు విద్యార్థులకు ఇబ్బందులు తెస్తున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి ప్రారంభంలోనే వడగాల్పులు వీస్తున్నాయి. రానున్న రెండు నెలల్లో ఎండ తీవ్రతను తలచుకుంటే భయాందోళన కలుగుతోంది. కానీ ఏపీ విద్యాశాఖాధికారులకు మాత్రం ఇవేవీ పట్టడం లేదు.
దేశ వ్యాప్తంగా ఒంటిపూట బడులు ప్రారంభించినా… ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖాధికారులు తమ రూటే సపరేట్ అనే రీతిలో వ్యవహరిస్తుండడం విమర్శలకు దారి తీసింది. తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించారు. కానీ ఏపీలో మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. మరోవైపు విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురై సొమ్మసిల్లి పడిపోతున్న పరిణామాలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
దశాబ్దాలుగా మార్చి రెండో వారం నుంచి మార్నింగ్ స్కూల్స్ నడపడం సంప్రదాయంగా వస్తోంది. కానీ జగన్ సర్కార్ మాత్రం ఆ విధానానికి స్వస్తి పలికి, తాము అన్నింటిలో డిఫరెంట్ అని నిరూపిస్తోంది. ఇదేదో విద్యావ్యవస్థకు మంచి చేసే విధానమైతే హర్షించొచ్చు. విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురై జ్వరం, తలనొప్పి తదితర అనారోగ్య సమస్యలకు గురవుతూ బడికి రాలేని పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో ఫ్యాన్లు లేకపోవడం, మరికొన్ని చోట్ల అవి ఉన్నా కరెంట్ బిల్లుకు భయపడి హెడ్‌మాస్టర్లు ఉపయోగించు కునేందుకు అభ్యంతరం చెబుతున్నారు.
కరోనా కారణంగా బడులకు సెలవులు ఇచ్చామని, అందుకే రెండు పూటలా నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఆశయం మంచిదే అయినా, విద్యార్థుల ఆరోగ్యానికి మించి ఏదీ ముఖ్యం కాదని విద్యాశాఖ అధికారులు ఎందుకు గ్రహించడం లేదని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కావున ఒంటిపూట బడులపై ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.