ఆంధ్రలో విద్యుత్ చార్జీలు పెరిగాయి. నిజమే. అవి ఇంతో..అంతో జనాలకు భారమే. కానీ ఇలా పెంచడం అన్నది తొలిసారి జరిగిందా? కొత్త సంప్రదాయానికి జగన్ తెరతీసారా? పదవిలోకి రానపుడు తగ్గిస్తామని హామీ ఇచ్చి వుండొచ్చు. పదవిలోకి వచ్చాక లెక్కల తత్వం బోధపడి వెనుకంజ వేసి వుండొచ్చు. కాదని అనడానికి లేదు. అంగీకరించాల్సిందే. పెంచారు కనుక, జగన్ తన హామీ విషయంలో ఫెయిల్ అయ్యారని అనడంలో తప్పు లేదు.
కానీ విద్యుత్ చార్జీలు అనేవి ఇప్పుడే తొలిసారి పెంచినట్లు. ఈ ఘోరాపరాథం జగన్ మాత్రమే చేసినట్లు అంటేనే చరిత్ర తెలియదు అనుకోవాలి. పక్కరాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలియనట్లు, తెలిసినా తమకు పట్టనట్లు వుండే పవన్ కళ్యాణ్ ను చూస్తే జాలేస్తుంది. తెలంగాణ వ్యవహారాలపై అక్కడే వుంటూ కూడా నోరు మెదపలేని ఆయన అసక్తతకు జాలేస్తుంది.
అసలు ఏపీఎస్ఈబీ గా పూర్తి ప్రభుత్వ సంస్థగా వుండే విద్యుత్ సంస్థను వాణిజ్యసంస్థలుగా మార్చింది ఎవరు? డిస్కమ్ లు ఏర్పాటు చేసింది ఎవరు? ఎడా పెడా ప్రయివేటు సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నది ఎవరు? ఆ సంస్థల్లో మనవాళ్లో, మన పార్టీ వాళ్లో, వుండేలా చూసుకున్నది ఎవరు?
ఏపీఎస్ఈబీ గా వున్నపుడు నిర్ణయం ప్రభుత్వం చేతుల్లో వుండేది. లాభనష్టాల బేరీజు వుండేది కాదు. ప్రభుత్వం నుంచి కేటాయింపులు వుండేవి. ఇప్పుడు డిస్కమ్ లు, కార్పొరేషన్లుగా మారిన తరువాత రుణాల సేకరణ, లాభ నష్టాలు అన్నీతయారయ్యాయి. ఇన్ ఫా స్ట్రక్చర్ పెంచాలంటే నిధులు కావాలి. రుణాలే గతి. రుణాలు కావాలంటే సంస్థల నిబంధనలకు తలొగ్గాలి. సంస్థ లాభసాటిగా వండకపోయినా, నష్టాలు చూపించకూడదు.
విద్యుత్ వినియోగం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. పల్లెల్లో కూడా ఎయిర్ కండిషన్ లు పెరిగిపోయాయి. వాషింగ్ మెషీన్లు వచ్చేసాయి. సరిపడా విద్యత్ ఇవ్వకపోతే కోతలు అనే అపప్రధ. సరిపడా కావాలి అంటే భారీ రేట్లకు కొనుగోలు చేయాలి. అలా చేసినపుడు రేట్లు పెంచాలి.
ఈ సర్కిల్ అంతా అలవాటు చేసింది చంద్రబాబు కదా? దీని సృష్టి కర్త ఆయనే కదా? ఎటొచ్చీ జగన్ చేసిన తప్పిదం ఏమిటంటే ఓ ఎన్నికల హామీ ఇవ్వడం. దానిని నిలబెట్టుకోలేకపోవడం. మరి అంతకు ముందు చంద్రబాబు నిర్వాకాలు పవన్ కు తెలియవు అనుకొవాలా? అప్పుడు ఆయన అన్న ప్రజారాజ్యం పార్టీ ఎక్కడుంది? ఈయన కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏం చేస్తోంది?