సోము వీర్రాజు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఇపుడు. ఆయన ఇపుడు ఏమన్నా కూడా మీడియాలో హైలెట్ అవుతోంది. మామూలు బీజేపీ నేతగా ఉన్నపుడే చంద్రబాబు మీద బాణాలు ఎక్కుపెట్టిన చరిత్ర సోముది. ఇపుడు ఆయన కొత్త పదవిలో చెలరేగిపోతుంటే చంద్రబాబు చతికిలపడాల్సివస్తోంది.
చంద్రబాబు ఇపుడు మోడీ భజనలో తరిస్తున్నారు. రెండేళ్ళ క్రితం తాను ఊరూరా తిరిగి మోడీని అన్న మాటలను ఆయన కన్వీనియెంట్ గా మరచిపోయారు. ఆయన రాజకీయ అవసరం అలాంటిది మరి. కానీ దాన్ని మళ్ళీ జనం ముందు పెట్టి ఓ రేంజిలో రచ్చ చేసిన ఘనత విష్ణు వర్ధన్ రెడ్డిదైతే ఇపుడు సోము ఇంకాస్తా ముందుకువెళ్ళారు.
ఆయన ఏకంగా ఆదిత్య 369 టైం మిషన్ ఎక్కి 2002లో ల్యాండ్ అయ్యారు. నాడు చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉంటూ గుజరాత్ అల్లర్ల వేళ నరేంద్ర మోడీని సీఎం పదవ్ని నుంచి దిగిపొమ్మని డిమాండ్ చేశారు. అంతే కాదు ఆయన్ని బీజేపీ నుంచి సస్పెండ్ చేయమని కూడా గట్టిగా కోరారట. ఈ మేరకు బాబు నాటి ప్రధాని వాజ్ పేయిని బ్లాక్ మెయిల్ చేశారని కూడా సోము నాటి కధను మళ్ళీ ఈ తరానికి, ప్రత్యేకించి బాబుకు వినిపించారు.
నాడు బీజేపీ నిజానిజాలు తెలుసుకుంది కనుక మోడీని బీజేపీ నుంచి సస్పెండ్ చేయలేదని, పైగా ఆయనే గుజరాత్ సీఎంగా మరింతకాలం విజయవంతంగా పనిచేశారని చెప్పుకొచ్చారు. నాడు బీజేపీ కనుక తొందరపడి ఉంటే మోడీ లాంటి ఘనమైన ప్రధాని ఈ దేశానికి ఈనాడు మిస్ అయ్యేవారని కూడా కొత్త లాజిక్ ని జనం ముందు పెట్టారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే మోడీని గద్దె దిగమన్న బాబు ఇపుడు విపక్ష నేతగా ఉన్నారు. మోడీ రెండవ మారు ప్రధానిగా అలా వెలిగిపోతున్నారు. ఈ సమయంలో మోడీని తెగ పొగుడుతున్న బాబు నైజాన్ని జనంలో ఎండగడుతూనే మోడీకి కూడా పాతగాయాన్ని మరోసారి గుర్తు చేయడం ద్వారా బాబు మీద కోపాన్ని సోము పెంచేశారు.
మొత్తానికి సోము తాము ఏదీ మరచిపోలేదని, బాబు ఆటలు ఇకపైన బీజేపీలో చెల్లవని స్ట్రాంగ్ గానే చెప్పేస్తున్నారు. సోము జోరు చూస్తూంటే బాబు ఫ్లాష్ బ్యాక్ చరిత్రను పదే పదే వల్లిస్తూ ఇంకా బదనాం చేసేలా ఉన్నారంటున్నారు. ఆయన ఏది చేసినా ఖండించడానికి కూడా బాబు సహా ఏ ఒక్క తమ్ముడూ ధైర్యం చేయకపోవడమే అసలైన రాజకీయ విడ్డూరం.