తనతో సంసారం చేస్తున్న జనసేనాని పవన్‌కల్యాణ్‌కు లవ్ ప్రపోజల్‌పై ఏపీ బీజేపీ సీరియస్‌గా రియాక్ట్ అయింది. ఒకవైపు ఇష్టంతో కలిసి కాపురం చేస్తున్న వ్యక్తిపై బాబు మనసు పారేసుకోవడాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జీర్ణించుకోలేకున్నారు. ఇలాగైతే తమ గతి ఏం కావాలని ఆయన నిలదీశారు.
ఏపీలో అనధికారికంగా టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏ సినిమా కథకు తీసిపోని విధంగా ఇద్దరు భామల ముద్దుల ప్రియుడిగా పవన్‌కల్యాణ్ రాజకీయ తెరపై జీవిస్తున్నారు. ఇంకా ఎన్నికలకు రెండు న్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ…. కలిసి కాపురం చేద్దామని పవన్‌ను చంద్రబాబు కన్ను గీటడంతో వివాదం వీధికెక్కింది.
కుప్పంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా బీజేపీతో సంబంధం లేకుండా జనసేనపై ఆయన మనసు పారేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కుప్పం పర్యటనలో ఆయన ఏమన్నారంటే…‘ఇద్దరు ప్రేమించుకుంటే అది పెళ్లి వరకు వెళ్తుంది. వన్ సైడ్ లవ్ పనికిరాదు కదా! మనం జనసేనను ప్రేమిస్తున్నాం. జనసేన కూడా కలిసి రావాలి కదా’ అని బాబు అన్నారు.
జనసేనకు ప్రేమ ప్రతిపాదనలపై సోము వీర్రాజు తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇవాళ ఆయన స్పందన ఏంటంటే…
‘తన అధికారం కోసం ఎవరినైనా చంద్రబాబు లవ్ చేస్తారు. అవసరమైనప్పుడే లవ్ చేయడంలో ఆయన సమర్థుడు. గతంలో కాంగ్రెస్‌ను కూడా ఆయన లవ్ చేశారు. చంద్రబాబు అవసరమైనప్పుడు లవ్ చేస్తారు… ఆ తర్వాత ఏం చేస్తారో నా నోటితో చెప్పను. చంద్రబాబు పచ్చి అవకాశవాది. ఏపీలో బీజేపీ, జనసేన మిత్రపక్షం’ అని ఘాటు రిప్లై ఇచ్చారు. అయినా చంద్రబాబుకు అధికారం తర్వాతే ఏదైనా, ఏమైనా? అనేది జగమెరిగిన సత్యం.