అమానవీయ ప్రవర్తనతో కొన్ని కుటుంబాల ఉసురు తీసిన ఎమ్మెల్యే తనయుడిని టీఆర్ఎస్ పార్టీ ఎట్టకేలకు గెంటివేసింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు, టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రకటించడం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వెల్లడించింది.
వనమా రాఘవరావు దౌర్జన్యానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం బలైంది. రామకృష్ణ దంపతులతో పాటు ఇద్దరు కూతుళ్లు అగ్నికీలలకు ఆహుతి కావడం తెలుగు సమాజాన్ని కలచివేసింది. డబ్బు అడిగి ఉంటే ఇచ్చి వుండేవాడినని, కానీ ఎమ్మెల్యే కుమారుడు తన భార్యను కోరాడని, ఏ భర్త వినకూడని మాట వినాల్సి వచ్చిందనే ఆవేదనతో చావును ఆశ్రయించినట్టు అతను తీసిన సెల్ఫీ వీడియో వైరల్ అయింది.
ఇంత జరిగినా సొంత పార్టీ నాయకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ పౌర సమాజం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదు రైంది. ఈ నేపథ్యంలో అతనిపై వేటు వేస్తూ టీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదిలా వుండగా ఇక మీదట తన కుమారుడిని నియోజక వర్గానికి, పార్టీకి దూరం పెడతానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా వుండగా రాఘవరావు అరెస్ట్‌పై సస్పెన్ష్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే వనమా తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.