ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. తన తప్పిదానికి ఆయన పశ్చాత్తాపం చెందారు. తన మాటలను వక్రీకరించారని చెప్పుకొచ్చిన సోము వీర్రాజు… ఇవాళ మాత్రం ఓ మెట్టు వెనక్కి తగ్గడం గమనార్హం.
హత్యలు మాత్రమే చేసుకునే కడపలో కూడా ఎయిర్‌పోర్ట్ కట్టామని సోము వీర్రాజు రెండు రోజులక్రితం తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సోము వీర్రాజు వ్యాఖ్యలపై రాయలసీమ సమాజం భగ్గుమంది. బేషరతుగా క్షమాపణ చెప్పాలని సీమ సమాజం డిమాండ్ చేసింది.
ఈ నేపథ్యంలో సోము వీర్రాజు శనివారం ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన వేర్వేరు ట్వీట్లు చేశారు.
“రాయలసీమ రతనాల సీమ” ఈ పదం నాహృదయం లో పదిలం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శించే విషయంలో వాడిన పదాల వల్ల రాయలసీమ ప్రజలు మనసులు గాయపడ్డాయి. ఈ పదాలను వాపసు తీసుకుంటున్నాను. ఈ విషయంలో క్షమాపణలు చెబుతున్నాను” అని తన తప్పును సరిదిద్దుకున్నారు.
అలాగే మరో ట్వీట్ కూడా చేశారాయన. అందులో ఏమన్నారంటే… “నేను నిరంతరం రాయలసీమ అభివృద్ధి విషయంలో అనేక వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న విషయం ఆ ప్రాంత వాసులకు తెలుసు. రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టుల విషయాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించాను. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన” అని వెల్లడించారు.
నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సిన ఆవశ్యకతను కడపపై చేసిన వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. సోము వీర్రాజే కాదు, ఎవరైనా హద్దులు దాటి మాట్లాడితే ప్రజావ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు.